
గృహప్రవేశాలకు సిద్ధం
జిల్లాలో నెలాఖరులో ప్రారంభోత్సవం
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వివిధ దశల్లో 3,686 ఇళ్లు
నారాయణఖేడ్: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరున ఇళ్ల గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇందులోభాగంగా జిల్లాలో ఈ నెలాఖరులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 100 ఇళ్లను ప్రారంభిస్తూ లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు జిల్లా గృహనిర్మాణ శాఖ సిద్ధమైంది. అందుకు నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్ల పనులు చకచకా పూర్తి చేయిస్తున్నారు. ఈ పథకాన్ని జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేల సిఫారసు మేరకు 14,505 ఇందిరమ్మ ఇళ్లకు కలెక్టర్ మంజూరు ఇచ్చారు. ఇందులో నిర్మాణాలకు ముందుకు వచ్చిన 7,223మంది లబ్ధిదారులకు అధికారులు నిర్మాణాలకు సంబంధించి ముగ్గువేసి మర్కోట్ ఇచ్చారు. కాగా, వీటిలో పునాది స్థాయిలో 3,383 ఇండ్లు ఉండగా 303 నివాసాలు రూఫ్ లెవల్ నిర్మాణం జరిగాయి. ఆర్‌సీసీ నిర్మాణం 103 ఇళ్లు పూర్తి చేశారు. ఒక నివాసం ఇప్పటికే పూర్తయ్యింది. 2,783మంది లబ్ధిదారులకు పునాది నిర్మాణం పూర్తి చేసుకున్నందున రూ.లక్షల చొప్పున వారి ఖాతాలో డబ్బులను జమ చేశారు. 191 ఇళ్లకు రూఫ్‌లెవల్ నిర్మాణం పూర్తయిన బిల్లులు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. ఆర్‌సీసీ పూర్తి చేసుకున్న 66 ఇళ్లకు బిల్లులు అందించారు. మిగతా ఇళ్ల బిల్లుల చెల్లిపులు ప్రాసెస్‌లో ఉన్నాయి. జిల్లాలో 103 ఇళ్లు ఆర్‌సీసీ పూర్తి చేసుకోగా వీటన్నింటినీ లేదా 100 ఇళ్లను తప్పకుండా ప్రారంభించి గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.
గత పరిస్థితి వద్దని..
గత ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పేర నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. అపార్ట్‌మెంట్‌ల తరహాలో నిర్మాణాలు జరుగుతుండటంవల్ల చాలా నియోజకవర్గాల్లో నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయినా అర్హులకు అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు పట్టుదలతో ఈ పథకం కచ్చితంగా అర్హులకే దక్కాలనే సంకల్పంతో వారికి ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు మంజూరులిచ్చారు. మంజూరైన లబ్ధిదారులు కొందరు నిర్మాణాలు చేపట్టగా..ఇంకా చేపట్టని లబ్ధిదారులకు త్వరలో పనులు ప్రారంభింపచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గృహప్రవేశాలకు సిద్ధం