
అంగన్‌వాడీలను క్రమబద్ధీకరించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌చేయడంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ఐదవ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వ ఐసీడీఎస్‌తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే నూతన జాతీయ విధాన విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సిఫార్సులను అమలు చేస్తుందని మండిపడ్డారు.
ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ, ఇంగ్లిష్ మీడియం విద్య పేరుతో ఆరేళ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం సరైన నిర్ణయం కాదని ఇది ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్షురాలు కార్యదర్శి పి.మంగ, శశికళ, కోశాధికారి ఏసుమణి పాల్గొన్నారు.
ఆ సంఘం యూనియన్
రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి