
ఆదుకోని పెసర
భారీ వర్షాల కారణంగా పెసర పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల పెట్టుబడులు పెట్టినా చివరకు గింజ కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. చేనులో నీరు నిలిచి పైరు మొత్తం రంగుమారి కాయలు బూజు పడుతున్నాయి. కాయలు పగిలి గింజలు చేనుపైనే మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– జహీరాబాద్ టౌన్:
పత్తి, సోయాబీన్, కంది తరువాత పెసరను ఎక్కువగా రైతులు సాగు చేశారు. తక్కువ కాల పరిమితి, 50 రోజుల పంటను అంతర పంటగా కూడా సాగు చేస్తున్నారు. పెసర పంట, పచ్చిరొట్టె ఎరువులుగా నేల సారాన్ని కాపాడుతుంది. 25 శాతం ప్రొటీన్లు కలిగి ఉంటూ త్వరగా అరుగుదల ఉండే పప్పుధాన్యపు పంట. జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటలైన పెసర, మినుము,పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలను రైతులు సుమారు 7.75 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెసర సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు వేసుకున్నారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పంట కోతకు వచ్చింది. అక్కడక్కడ పంటను కోస్తున్నారు. ఇదే సమయంలో వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని చోట్ల పంటలు నీట మునిగి గింజలు పగిలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లపైనే గింజలు మొలకెత్తుతున్నాయి. ఎకరాకు సుమారు రూ. 15 వేల వరకు పెట్టుబడి పెట్టామని, చివరకు గింజ కూడా చేతికి రావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 60 శాతం వరకు పెసర పంట దెబ్బతిన్నట్లు తెలిసింది. వ్యవసాయ అధికారులు వర్షాలకు నీటి మునిగి దెబ్బతిన్న పంటలను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు.
వర్షాలకు నీరు నిలిచి దెబ్బతిన్న పంట
చేనుపైనే మొలకెత్తుతున్న వైనం
ఆందోళన చెందుతున్న అన్నదాతలు

ఆదుకోని పెసర