
తిమ్మాపూర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం
● ఇంటింటికీ జ్వర సర్వే ● 212 మంది నుంచి రక్త నమునాల సేకరణ
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్‌లో విష జ్వరాలతో బాధపడుతున్న ఘటనపై ఈ నెల 16న సాక్షిలో ‘ తిమ్మాపూర్‌లో విషజ్వరాలు’ అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాజశేఖర్‌కు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 17న గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొదటి రోజు 85 మందికి రక్తనామునాలు సేకరించి, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వర సర్వే చేపట్టారు. 360 ఇళ్లలో మొత్తం 212 మంది నుంచి ఇప్పటికి వరకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు వైద్యుడు రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో డెంగీతో చనిపోయిన మహేశ్, శ్రావణ్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకోగా డెంగీ లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో జిల్లా యంత్రాంగం, మండలంలోని వివిధ శాఖ అధికారులు స్పెషల్ డ్రై డే నిర్వహించారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, మందులు పిచికారీ చేసి, చెత్త సేకరణ చేపట్టారు. జిల్లా వైద్యాధికారి ధనరాజ్ ఆధ్వర్యంలో ఆర్‌ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని, వైద్యులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా అనంతసాగర్‌లో కూడా విష జ్వరాలు విజృంభించాయని గ్రామస్తులు తెలిపారు. సుమారు పదిహేను మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారని, ఇక్కడ కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు.

తిమ్మాపూర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం