
ఆస్తి పంపకాల విషయంలో తగాదా
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సిద్దిపేటరూరల్: ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు తలెత్తడంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తోర్నాల గ్రామానికి చెందిన మేడిశెట్టి పుష్పమ్మకు ఇద్దరు కుమారులు నవీన్, శ్రవణ్ ఉన్నారు. నవీన్ ట్రాక్టర్ నడిపిస్తూ జీవనం సాగిస్తుండగా, శ్రవణ్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అన్నదమ్ములు ఇరువురి భాగస్వామ్యంతో వరి కోత యంత్రం కొనుగోలు చేసి కొద్ది రోజులుగా నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా సంవత్సరం క్రితం వరికోత యంత్రానికి సంబంధించిన శ్రవణ్ భాగాన్ని నవీన్ కొనుగోలు చేశాడు. మరోవైపు నాటి నుంచి ఆస్తి పంపకాలు ఇతరత్రా వ్యవహారాల్లో ఇరువురి మధ్య వివాదం కొనసాగుతోంది. గొడవ చివరికి పోలీసు స్టేషన్‌కు చేరింది. దీంతో ఇరువురిని పోలీసులు మందలించి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో నవీన్ ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగే ఫొటోను, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితుడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సీఐని సాక్షి వివరణ కోరగా... ఎవరిని కొట్టలేదని, వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, సమస్య పరిష్కారానికి సలహాలు ఇచ్చామన్నారు. ఎవరో కావాలని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీఐ తెలిపారు.