
హామీలు అమలు చేయాలి
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నర్సాపూర్ రూరల్: ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లో ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల 9న హైదరాబాద్‌లో చేపట్టనున్న మహాధర్నా సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నెల రోజులకే వికలాంగులు, వితంతువులు, వద్ధులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది పెన్షన్‌పై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. కొత్తగా మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాగా అంతకుముందు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సూరారం నర్సింలు మందకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఇన్‌చార్జి సైదులు, వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు పాండు, కళామండలి సభ్యుడు రమేశ్ పాల్గొన్నారు.