
గ్రేడ్ తెద్దామిలా
సెలక్షన్ గ్రేడ్ కోసం
అధికారుల ప్రయత్నం
అవకాశాల సద్వినియోగానికి
కార్యాచరణ
వ్యవసాయ మార్కెట్‌కు
ప్రతీ ఏటా పెరుగుతున్న ఆదాయం
జహీరాబాద్: జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి ఆదాయం పెంచి సెలక్షన్ గ్రేడ్ సాధన కోసం అధికారులు దృష్టి సారించారు. ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఈ ఘనత సాధించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం సుమారు రూ.3.50 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. దీన్ని రెట్టింపు చేసే దిశలో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికను రూపొందించేందుకు నిర్ణయించారు. గత నాలుగు దశాబ్దాల క్రితం జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఒకప్పుడు సాధారణ మార్కెట్‌గా ఉండగా, ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ స్థాయికి అనధికారికంగానే చేరింది. జహీరాబాద్ అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉంది. నియోజకవర్గం ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా రైతులు ధాన్యం తెచ్చి విక్రయించుకుంటున్నారు. మార్కెట్‌కు గంజ్ ద్వారా ప్రతీ ఏటా రూ.83.50 లక్షలు, సరుకుల దిగుమతి ద్వారా రూ.2.92 కోట్లు, చెక్ పోస్ట్ ద్వారా రూ.5.45 లక్షలు, పశువుల మార్కెట్ ద్వారా రూ.31.85 లక్షలు, పండ్ల మార్కెట్ ద్వారా రూ.40వేలకు పైగా ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం మార్కెట్ యార్డులో పాత గోదాం తొలగించి రూ.3.35 కోట్లతో 24 కొత్త దుకాణాల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీని ద్వారా కూడా మార్కెట్ ఆదాయాన్ని పెంచుకునేలా నిర్ణయించారు. ఇతర ఆదాయ మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు.
గ్రేడ్ పెరిగితే అభివృద్ధికి ఆస్కారం
వ్యవసాయ మార్కెట్‌ను స్పెషల్ గ్రేడ్‌కు పెంచుకోవడం వల్ల పలు అభివృద్ధి పనులు చేసుకునేందుకు వీలవుతుంది. కార్యాలయంలో సిబ్బందిని మరింత పెంచుకోవచ్చు. షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణం చేసుకునేందుకు దోహదపడుతుంది. గంజ్ మైదానంలో రోడ్లను నిర్మించుకునే అవకాశం ఉంటుంది. పశువుల మార్కెట్లో కనీస సదుపాయాలను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది.
మార్కెట్‌కు సమకూరుతున్న ఆదాయం
సంవత్సరం ఆదాయం
2020–21 రూ.1.30కోట్లు
2021–22 రూ.2.19కోట్లు
2022–23 రూ.2కోట్లు
2023–24 రూ.5.13కోట్లు
2024–25 రూ.3.28కోట్లు
ఆదాయం పెంపునకు కృషి
మార్కెట్ ఆదాయాన్ని పెంచి సెలక్షన్ గ్రేడ్ కోసం కృషి చేస్తున్నాం. ఆదాయవనరుల పెంపకం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. దుకాణాల నిర్మాణం ద్వారా ఆదాయం పెరగనుంది. ఈసారి వర్షాలు బాగా ఉండటంతో అధికంగా ధాన్యం పండి మార్కెట్ ఆదాయం పెరగనుంది. పత్తి జిన్నింగ్ మిల్లు ఏర్పాటవుతున్నందున ఆదాయం పెరగనుంది.
– చంద్రశేఖర్, మార్కెట్ ప్రత్యేక కార్యదర్శి,
జహీరాబాద్

గ్రేడ్ తెద్దామిలా