
డ్రగ్స్‌పై పోరులో యువత భాగస్వామ్యం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: మత్తు పదార్థాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని జిల్లా ఆరోగ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు. తారా ప్రభుత్వ కళాశాల నిషా ముక్తి భారత్ అభియాన్, మిషన్ పరివర్తనలో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా శిశు, వికలాంగుల, వయోజన వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాలు వ్యక్తులను మానసికంగా, శారీరకంగా నిర్వీర్యం చేస్తాయన్నారు. మత్తు పదార్థాలు అమ్మినా, కొన్నా, వినియోగించిన నేరమని, ఎవరు డ్రగ్స్ బారిన పడవద్దని సూచించారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, ర్యాగింగ్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. సీఐ రమేశ్ మాట్లాడుతూ..యువత సైబర్ మోసాలకు గురికావొద్దని, ఫోన్లకు వచ్చే అపరిచిత కాల్స్‌కు ప్రతి స్పందించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీపీ అధికారి డాక్టర్ కెప్టెన్ విజయ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, అధ్యాపక బృందం, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీపీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ఆరోగ్య అధికారి శ్రీనివాస్