అకాల వర్షాలకు రైతులు నష్టపోకూడదు
కొండాపూర్(సంగారెడ్డి): అకాల వర్షాలతో జిల్లాలో రైతులెవరూ ఇబ్బందులు పడకూడదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకున్నా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలోని తొగర్‌పల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సందర్శించి, నిర్వహణపై తీరును పరిశీలించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, దరఖాస్తుల ప్రక్రియ, విధానాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా, నాణ్యత కోల్పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్‌లు, గన్నీ సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరలకే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు రవాణా చేయాలని సూచించారు. తేమ శాతం కొంచెం ఎక్కువగా వున్నా ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లకు, డీలర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమయ్యేలా ఆన్‌లైన్‌లో ఖాతా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
రెవెన్యూ సేవల్లో పారదర్శకత
భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలులో పారదర్శకత, సమర్థత, వేగం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. భూభారతి గ్రామ సభలలో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. భూభారతి గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులు ఉచితంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్‌డీఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ అశోక్, పీఎసీఎస్ సిబ్బందితోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు భూభారతిపై సమీక్ష
భూ భారతిపై నిర్వహించిన గ్రామ సభలలో వచ్చిన సమస్యలపై శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతోపాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వై.ప్రభు ఓ ప్రకటనలో తెలిపారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి


