భవన నిర్మాణాలకు భూములివ్వండి
● తాత్కాలిక భవనాల్లోనే పీఎస్‌ల నిర్వహణ ● ఇబ్బందులు పడుతున్న పోలీసు సిబ్బంది, స్థానికులు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌స్టేషన్ భవనాలను నిర్మించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో అనేక పోలీస్‌స్టేషన్‌లు తాత్కాలిక భవనాల్లో ఉండటమే ఇందుకు నిదర్శనం. కొన్ని పోలీస్ స్టేషన్లకు భూములు లేక, సొంత భవనాలు లేకపోవడంతో అరకొర వసతులతోనే వాటిని నిర్వహిస్తున్నారు. దీంతో అటు పోలీసు సిబ్బంది, ఇటు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా నిత్యం విధులు నిర్వర్తించే పోలీసులకు పోలీస్ స్టేషన్ల భవనాల కోసం భూమిని కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అరకొర వసతులు.. తాత్కాలిక భవనాల్లోనే
ఈ ప్రాంతాలలో అనేక పోలీస్‌స్టేషన్‌లను అరకొర వసతులతో తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ను పూర్వకాలంలో బెల్ యాజమాన్యం నిర్మించిన భవనంలోను, కొల్లూరు పోలీస్‌స్టేషన్ ఉస్మాన్‌నగర్‌లోని మహిళాభవనంలో నిర్వహిస్తున్నారు. ఇక బానూర్ పోలీస్‌స్టేషన్‌ను బీడీఎల్ యాజమాన్యం కేటాయించిన భవనంలో, పటాన్‌చెరు పీఎస్‌ను ఓ పురాతన భవనంలో ఏర్పాటు చేశారు. అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ను ఓ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో, గుమ్మడిదల, బొల్లారం పోలీస్ స్టేషన్లను, తాత్కాలిక భవనాల్లోను, జిన్నారం పోలీస్ స్టేషన్‌ను ఓ పాతభవనంలో నిర్వహిస్తున్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా...
ఈ ప్రాంతంలో అనేక కాలనీలు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని గత పాలకులు పలు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. కానీ, అందుకనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించలేదు. దీంతో పోలీసులకు, ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
భూములు కేటాయించండి
పటాన్‌చెరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. దానికనుగుణంగా పాలకులు వివిధ శాఖల భవనాల కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి ఆధునిక భవనాలను నిర్మిస్తున్నారు. కానీ, పోలీస్‌స్టేషన్‌లకు భూములను కేటాయిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప దానిని ఆచరణలో పెట్టడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని పీఎస్ నూతన భవనాల నిర్మాణం కు భూములను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇబ్బందులు తప్పడం లేదు..
పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను పార్కింగ్ చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఎక్కువ మంది వస్తే రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి నెలకుంటోంది. వాహనాలను సైతం రోడ్లపైనే పార్కింగ్ చేసుకోవాల్సిన దుస్థితి.
ఆధునీకరించాలి
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌స్టేషన్‌లను అభివృద్ధి చేయాలి. అందుకు ప్రభుత్వం భూమలను కేటాయించి ఆధునిక పోలీస్‌స్టేషన్ భవనాలను నిర్మించాలి.
–ఈశ్వరగారి రమణ, తెల్లాపూర్ నైబర్‌హూడ్ అసోసియేషన్ అధ్యక్షుడు
నిర్లక్ష్యం ఎందుకు..?
శాశ్వత పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణం కోసం భూములను కేటాయించడంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారనే ప్రశ్న అటు పోలీసుల్లోనూ ఇటు ప్రజలను వేధిస్తోంది. గతంలో రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ కోసం మూసివేసిన శ్రీనివాస్ థియేటర్ పక్కన స్థలాన్ని గత పాలకులు, కొల్లూర్, గుమ్మడిదల, పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ల కోసం భూములను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కానీ ఇప్పటికీ ఆ భూములను పోలీస్టేషన్ల కోసం కేటాయించలేదు.
భవన నిర్మాణాలకు భూములివ్వండి
భవన నిర్మాణాలకు భూములివ్వండి
భవన నిర్మాణాలకు భూములివ్వండి


