ప్రకృతి ప్రియులకు స్వర్గధామం.. చుట్టూ నీరు, మధ్యలో ఊరు.. ఎక్కడో తెలుసా?

Tourist Place In Tirupati Irakam Island Village Middle Of Pulicat Lake - Sakshi

చిత్తూరు నుంచి తిరుపతి ప్రత్యేక జిల్లాగా వేరుపడ్డాక ఈ ప్రాంతానికి సముద్రంతో పాటూ ఒక దీవి వచ్చి చేరింది. ఆ దీవి పేరు ఇరకం. ఇది తడ మండలంలోని పులికాట్‌ సరస్సు మధ్యలో ఉంది. చుట్టూ నీరు.. మధ్యలో ఊరు. ఈ దీవిలో పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 

అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు.. తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా.. అద్భుతంగా కనిపిస్తాయి. మరో విశేషమేమంటే.. చుట్టూ ఉప్పునీరున్నా.. రెండు గ్రామాలున్న ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రాంతానికి పర్యాటక శోభ తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

తడ(తిరుపతి జిల్లా): కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాకి నెల్లూరు జిలాల్లోని సముద్రం (బంగాళాఖాతం) తడ మండలం పరిధిలోని పులికాట్‌ సరస్సు, సరస్సు నడుమ ఉన్న అందాల ఇరకం దీవి సొంతమయింది. 4,486 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దీవిలోని ఇరకం గ్రామంలో మొదలియార్‌లు, హరిజనులు, గిరిజనులతోపాటు తిరువెంకటానగర్‌ కుప్పంలో సుమారు రెండు వేల మంది కలిగిన మత్స్యకారులు 580 ఇళ్లల్లో జీవిస్తూ ఉన్నారు. ఈ దీవిలో 2200 ఎకరాల వ్యవసాయభూమి ఉండగా ఇందులో వరిసాగు చేస్తారు. దీవిలో నుంచి 200 మంది విద్యార్థులు ఆరంబాకం, సున్నపుగుంట గ్రామాలకు చదువు కోసం పడవల్లో పులికాట్‌ సరస్సు మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు.

పడవలో షికారు
మరో వైపు ఈ దీవి వైపు పర్యాటకుల చూపు పడింది. ఆహ్లాదంగా కనిపించే సరస్సుపై పడవలో షికారు తిరగాలంటే మక్కువ చూపుతున్నారు. పండగలు, సెలవు దినాల్లో ప్రకృతి ప్రియులు బీవీపాళెం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి పడవల ద్వారా ఇరకం వెళతారు. అక్కడ సాయంత్రం వరకు సేదతీరి ప్రకృతి అందాలను ఆస్వాదించి తిరిగి వస్తున్నారు. బీవీపాళెం నుంచి పడవ ద్వారా 11 కిలో మీటర్ల దూరం ఉన్న ఇరకం దీవికి వెళ్లాలంటే పట్టే 40–45 నిమిషాల ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది. సరస్సులో చేపల వేట సాగించే తెరచాప పడవలు, అక్కడక్కడ చేపల కోసం కాచుకు కూర్చున్న విహంగాలు, పడవల పక్కనే ఎగిరెగిరి పడుతూ చేపలు చేసే విన్యాసాలు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇరకం తెల్లటి ఇసుకతో నిండిన గ్రామం. నీటి కోసం అక్కడక్కడ తవ్విన దొరువులు, దొరువుల చుట్టూ మొలిచిన మొగలి పొదలు, వెదురు చెట్లు సరికొత్త అనుభవాన్ని అందిస్తాయి.

దెబ్బతీసిన ఉప్పునీరు 
దశాబ్దాలుగా బంగాళాఖాతం నుంచి పులికాట్‌ సరస్సుకి నీటిని అందించే ముఖద్వారాలు పూడిపోతూ రావడం, సరస్సుకి సముద్రంద్వారా వచ్చే నీటికి అడ్డుకట్ట పడడంతో సముద్రం, సరస్సు మధ్య నీటితోపాటు రాకపోకలు సాగించే చేపలు, రొయ్యల కదలికలు తగ్గి పోయాయి. దీంతో మత్స్యకారులకు వేట కష్టతరమైంది. కొందరు అత్యాశ పరులు తమ స్వార్థం కోసం సరస్సు చుట్టూ ఉన్న పొర్లుకట్టను ధ్వంసం చేయడంతో ఉప్పునీళ్లు పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతిన్నాయి. ఇక్కడ చదువుకైనా, కాన్పుకైనా, పాముకరిచినా, అత్యవసర పరిస్థితిలో అయినా పడవ ప్రయాణం తప్ప మరో దారిలేదు.

పర్యాటక అభివృద్ధికి చర్యలు
ఇరకం దీవిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య ఇరకం దీవితోపాటు బీవీపాళెం, వేనాడు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రా, తమిళనాడు పర్యాటకులు సేద తీరేందుకు బీవీపాళెంలో నిర్మించిన రిసార్టులను టెండర్ల ద్వారా సమర్థులైన వారికి అప్పగించడంతోపాటు ఇరకం దీవిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇరకం దీవిలోని ప్రజలకు స్థానికంగానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతోపాటు వారికి సంబంధించిన భూములకు మంచి గిరాకీ లభించనుంది.

మరిన్ని వార్తలు :

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top