
రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
గ్రామీణ జీవనంలో ఒక భాగం
ఏటా మే నెలలో చెట్లకు పూత..
ప్రకృతి మానవాళికి అందించిన వరాల్లో చింతచెట్టు ఒకటి. ఈ చెట్టు నీడను మాత్రమే కాక ఆరోగ్యాన్ని పంచే కాయలు, చిగురునూ అందిస్తుంది. ఇందులో చింతచిగురు రుచితోనే కాక పోషక విలువలతో ఆరోగ్యాన్ని కాపాడేదిగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యంలో చింతచిగురును భాగంగా చేస్తారు. దీంతో చెడు కొవ్వును తగ్గించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, జీర్ణక్రియను సులభతరం చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు.
అంతేకాక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలోనూ సాయపడుతుందని నమ్ముతారు. కాగా, సంప్రదాయ వైద్యంలో చింతచిగురును ఉపయోగిస్తారు. ఆయుర్వేద
వైద్యవిధానంలో శరీరంలోని వేడి తగ్గించే, జీర్ణ సమస్యలను పరిష్కరించే గుణాలు కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. దీన్ని కషాయంగా చేసి జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇస్తారు. అంతేకాక చింతచిగురు శరీరంలోని విష పదార్థాలను తొలగించే డిటాక్స్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందని చెబుతారు. – కరకగూడెం

చింతచిగురు కోస్తున్న మహిళలు
రుచి, ఆరోగ్యం
అద్భుతమైన రుచి కలిగి ఉండే చింతచిగురు ఆరోగ్య సమతుల్యానికి అండగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా చింతచిగురుతో కూరలు చేయడమే కాక పప్పు, చేపలు, చికెన్, మటన్ వంటి వాటిలోనూ కలిపి వండుతారు. ఇక చట్నీలు, పచ్చళ్లు కూడా పలువురు చేస్తారు. ‘సీ’విటమిన్ లోపంతో బాధపడేవారు టాబ్లెట్లకు బదులుగా చింతచిగురును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగా విటమిన్ అందుతుందని చెబుతారు. అందుకే ఇది గ్రామీణ జీవనంలో ఒక భాగంగా నిలుస్తోంది. చింతచిగురు మార్కెట్లలో మంచి ధర పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు ఈ చిగురును సేకరించి విక్రయించడం ద్వారా సీజనల్ ఆదాయాన్ని పొందుతారు.
పర్యావరణ పరిరక్షణ
చింతచెట్టు కేవలం ఆహారం ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే కాక పర్యావరణ పరిరక్షణలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు తన దట్టమైన ఆకులతో వేసవి తాపాన్ని తగ్గించి నీడను అందిస్తుంది. అంతేకాక చింతచెట్టు వేర్లు నేల కోతను నివారించడంతో ఈ చెట్టు నేల సంý‡క్షణలో సాయపడుతుంది. అలాగే, పక్షులు, కీటకాలు ఆధారంగా నిలుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి.
వంటకాలకు ప్రత్యేక రుచి
చింతచిగురు అంటే చాలా ఇష్టం. ఇది వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. పప్పు, చేపలు, చికెన్, మటన్ వంటి కూరల్లో ఉపయోగిస్తాం. ప్రత్యేకంగా చింతచిగురు కూర కూడా వండుతాం. చింత చిగురుతో చట్నీలు, పచ్చళ్లూ చేస్తాం. ఆరోగ్యానికి మంచిదని నమ్ముతాం. – పోలేబోయిన విజయలక్ష్మి,వెంకటాపురం
చిన్నప్పటి నుంచీ తీసుకుంటున్నా..
నేను చిన్నప్పటి నుంచి చింతచిగురును ఆహారంలో తీసు కుంటున్నా. గతంలో లేత చిగురు కోసం అడవికి వెళ్లేవాళ్లం. చింత చిగు రుతో చేసే కూరలు రుచిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే సీజనల్‌లో తప్పకుండా చిగురును ఆహారంలో తీసుకోవాలి. – పాయం రామయ్య, మొగిలితోగు చాలారకాల
వంటలు చేస్తాం..
మా ఇంట్లో చింత చిగురుతో చాలా రకాల వంటలు చేస్తాం. ప్రధానంగా పప్పుతో కలిపి వండటం ద్వారా మంచి రుచి వస్తుంది. చింత చిగురులో చాలా పోషకాలుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్‌లో పిల్లలు, పెద్దలు చిగురుతో చేసే వంటలను ఇష్టపడతారు. – జాడి నర్సక్క, చొప్పల