సింగరేణిలో ‘గుర్తింపు’ ఎప్పుడో?

Elections To Singareni Recognised Trade Union TBGKS Elections - Sakshi

ఎన్నికలకు పట్టుబడుతున్న కార్మిక సంఘాలు 

ఇంకా తేల్చని యాజమాన్యం 

దేవునికే ఎరుకంటున్న టీబీజీకేఎస్‌

సాక్షి,పెద్దపల్లి: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ఊసులేకుండా పోయింది. కోల్‌బెల్ట్‌ ప్రాంతం, ఎమ్మెల్యే, ఎంపీల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ ఎన్నికలను ఆచితూచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, కేంద్రం మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గుర్తింపు ఎన్నికల గడువు దాటి నాలుగేళ్లు అవుతోందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఎస్‌ కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. 

11 ఏరియాలు 42 వేల మంది కార్మికులు
సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో సుమారు 42 వేల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. ఆరు కార్మిక సంఘాలు పోటీలో ఉంటున్నాయి. 1998లో మొదటిసారి రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి నిర్వహించారు. ఈసారి కోవిడ్‌ కారణంగా గుర్తింపు ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు కోరినప్పటికీ యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో బొగ్గుగని కారి్మకుల సమస్యల పరిష్కారం కోసం కోలిండియావ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన సింగరేణి యాజమాన్యం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహాయించి మిగతా డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించింది. చర్చల సమయంలో సింగరేణిలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. అయితే ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మార్చి చివరినెల కావడంతో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ వెనక్కివెళ్లింది. 

కార్మిక సంఘాల పట్టు 
సింగరేణి గుర్తింపు సంఘం గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు యూనియన్‌ టీబీజీకేఎస్, అలాగే ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ ఎన్నికలకు ముందే కారి్మకులకు దగ్గర కావాలని చూస్తున్నాయి. బస్సుయాత్ర, జీపుయాత్ర, శిక్షణతరగతులు, జనరల్‌బాడీ సమావేశాల పేరుతో ఇప్పటికే గనుల్లో ఈ సంఘాల నేతలు పర్యటించారు.  

ఇంకా తేల్చని యాజమాన్యం
సింగరేణి గుర్తింపు ఎన్నికలపై యాజమాన్యం ఇంకా తేల్చలేదు. మార్చి¯ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎన్నికలుంటాయని కార్మిక సంఘాలు భావించినా ఎలాంటి నిర్ణయం వెలుబడలేదు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల పక్రియ ప్రారంభిస్తే ఒక్కో షిఫ్టుకు రెండు గంటల మేర అంతరాయం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఆలోచిస్తోంది.  

ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవునికే ఎరుక  
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవుడికే ఎరుక. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం. గుర్తింపు యూనియన్లకు సంబంధించిన పత్రాలన్నీ ఎప్పుడో సమర్పించాం. 
– వెంకట్రావ్, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top