పేద బిడ్డలకు కార్పొరేట్‌ చదువు | - | Sakshi
Sakshi News home page

పేద బిడ్డలకు కార్పొరేట్‌ చదువు

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

షాద్‌నగర్‌: విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను తీసుకొచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది సర్కారీ విద్యకు కొత్త రూపు తీసుకొస్తోంది. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వగ్రామమైన ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామంలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ స్కూల్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ గ్రామంలో కొనసాగుతున్న ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇదే పాఠశాలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌)గా ఏర్పాటు చేయనున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ శుక్రవారం దీనికి శంకుస్ధాపన చేయనున్నారు.

కమిషన్‌ సూచనతో..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో డాక్టర్‌ ఆకునూరి మురళి నేతృత్వంలో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి టీపీఎస్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

అత్యాధునిక వసతులు

కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా టీపీఎస్‌లలో సకల సదుపాయాలు కల్పించనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఆంగ్ల మాధ్యమం బోధిస్తారు. ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన చేసేందుకు వీలుగా డిజిటల్‌ తరగతులు, సైన్స్‌ ల్యాబ్‌లు, లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్‌ తదితర క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఇండోర్‌ గేమ్స్‌ చెస్‌, క్యారమ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ తదితర ఆటలు ఆడేందుకు క్రీడా పరికరాలు, శిక్షకులను కూడా ప్రభుత్వం నియమించనుంది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మద్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌ కూడ ఇవ్వనున్నారు. విద్యార్ధులు పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు స్కూల్‌ బస్సులను కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇలాంటి సదుపాయాలతో కూడిన మోడల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బూర్గులలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు రేపు శంకుస్థాపన

హాజరు కానున్న మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

కాన్వెంట్స్‌ను తలదన్నేలా టీపీఎస్‌లో బోధన, సదుపాయాలు

రూ.10 కోట్లతో రూపుదిద్దుకోనున్న పాఠశాల క్యాంపస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement