చిన్నారుల సంరక్షణకు ‘క్రెచ్‌’ | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల సంరక్షణకు ‘క్రెచ్‌’

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

షాద్‌నగర్‌: చిన్నారుల బంగారు భవిష్యత్తు, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శాంతిశ్రీ అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నందిగామలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కమ్‌ క్రెచ్‌ కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలపై హింస నిర్మూలన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాంతిశ్రీ మాట్లాడుతూ.. చిన్నారుల సంరక్షణకు భరోసా కల్పిస్తూ, మహిళలకు ఉపాధి అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కమ్‌ క్రెచ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. చిన్నారుల సంక్షేమం, సంరక్షణపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సెంటర్‌ ద్వారా పిల్లలకు సురక్షితమైన సంరక్షణ, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, భద్రతతో పాటు వారి అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కేంద్రాలకు పంపించి, వారు ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లవచ్చన్నారు. తల్లిదండ్రులు ఉపాధి పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని స్పష్టంచేశారు. సమాజంలో మహిళలు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొమ్ము కృష్ణ, సీడీపీఓ ఉదయ, అధికారులు మాణికప్ప, పవిత్ర, తదితరులు పాల్గొన్నారు.

నందిగామలో ప్రారంభించిన శిశు సంక్షేమ అధికారి శాంతిశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement