రూ.9,100 కోట్లతో పలు పనులకు శంకుస్థాపనలు అభివృద్ధికి అడ్డురావొద్దని వార్నింగ్ పాలమూరు జిల్లా చుట్టే సీఎం ప్రసంగం అంతర్మథనంలో జిల్లా ఎమ్మెల్యేలు
వికారాబాద్: సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఏ మేరకు కంకనబద్దులయ్యారో ఆయన చేతలు.. మాటల్లోనే అర్థమవుతోంది. కొడంగల్ అభివృద్ధి విషయంలో తన వైఖరేంటో సోమవారం జరిగిన బహిరంగ సభలో స్పష్టం చేశారు. భారీగా నిధుల వరద పారించడం ద్వారా చేతల్లో నిరూపిస్తూ.. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డొస్తే అడ్డంగా తొక్కుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కడా(కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ) పేరుతో ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా నిర్వహించిన పర్యటనలో ఏకంగా రూ.9,100 కోట్ల విలువ చేసే పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. అటు ప్రతిపక్షాలకు తన మనోగతాన్ని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఎవరు అంగీకరించినా..? అంగీకరించకపోయినా.? కొడంగల్‌ను అభివృద్ధి చేసి తీరుతానని.. అడ్డుపడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడిపోయారు.
పాలమూరు దాటని సీఎం మాట
సీఎం కొడంగల్ మూడు రోజుల పర్యటనలో రెండు రైతు మహాసభలు, మహిళలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించారు. దీపావళి పండుగను, తన పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గ ప్రజల మధ్య జరుపుకొన్నారు. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన నిర్మాణాలను ప్రారంభించారు. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మొత్తం ప్రసంగంలో పరిగి నియోజకవర్గానికి పరిశ్రమలు వస్తున్నాయనే మాట తప్ప ఎక్కడ కూడా జిల్లా పేరు ప్రస్తావించలేదు. సీఎం ప్రసంగం ఆద్యంతం పాలమూరు జిల్లా పేరుతోనే సాగింది. గత ప్రభుత్వం పాలమూరుకు అన్యాయం చేసిందన్న ఆయన పాలమూరు ఎత్తి పోతల పథకం ఎప్పటిలోగా పూర్తి చేస్తామనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గానికి సాగునీరందించే నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండేళ్లలో(డిసెంబర్ 2028 వరకు) ఎవరు అడ్డం వచ్చినా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసి తీరుతానని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల గురించి గాని ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేసింది. జిల్లా నలుమూలల నుంచి జనం వచ్చారు. సభలో ఇతర ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం చర్చకు దారి తీసింది.
ప్రతిసారీ నిరాశే
తెలంగాణ కల సాకారమయ్యాక పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం వివక్షకు గురైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి సీఎం కావడం.. వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా అన్ని విధాలా పురోగతి సాధిస్తుందని ప్రజలు ఆశపడ్డారు. అయితే రేవంత్‌రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు దాటినా తన సొంత నియోజకవర్గం కొడంగల్ మినహా మిగతా మూడు నియోజకవర్గాలకు చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. సీఎం వద్దే మున్సిపల్ శాఖ ఉన్నా జిల్లాలోని పురపాలికలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏడాది క్రితం నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యేలు హడావుడి చేసి అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేశారు. అంతటితోనే పనులు ఆగిపోయాయి. భూమిపూజ చేసి ఎనిమిది నెలలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో పలు మార్లు సీఎం జిల్లాలో పర్యటించినా కొడంగల్ మినహా మిగతా నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇదే విషయాన్ని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ప్రతిసారీ జిల్లాకు నిధుల వరద పారుతుందని ఆశించడం, ఆ తర్వాత నిరాశ చెందడం జిల్లా ప్రజలకు అలవాటయిపోయింది. తాజా పర్యటనలో కూడా ఇదే చోటుచేసుకుంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితోపాటు స్పీకర్ ప్రసాద్‌కుమార్ పైన కూడా ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. దీంతో వారు బయటికి చెప్పలేకపోయినా లోలోన ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. కొడంగల్ తరహాలో మిగిలిన మూడు నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడిపోయారు. ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. కొడంగల్‌కు మాత్రమే నిధులు మంజూరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా సరైన రీతిలో స్పందించడానికి అవకాశం లేక ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా సమస్యలను సీఎం దృష్టికి ఎలా తీసుకుపోవాలో పాలుపోక మిన్నకుండిపోతున్నారు.
సొంత నియోజకవర్గం కొడంగల్‌కు భారీగా నిధులు


