ఇబ్రహీంపట్నం: నకిలీ గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు సృష్టించి ఉద్యోగం పొందడమేకాకుండా, బ్యాంకు రుణం తీసుకని మోసాలకు పాల్పడుతున్న ముఠా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చందంపేట మండలం జగ్గుతండాకు చెందిన రామవత్ గోపాల్(43), పులి సురేశ్‌బాబు(43) సైదాబాద్‌లోని సుమైక్రో టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్లుగా పనిచేస్తూ.. మీర్పేట్ పరిధిలోని అల్మాస్‌గూడలో నివసిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మీపూర్ బీకే గ్రామానికి చెందిన గంటల శంకర్(42) కన్స్ట్రక్షన్ లేబర్‌గా పనిచేస్తూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్పల్లిలో ఉంటున్నాడు. గోపాల్, సురేశ్ కలిసి గంటల శంకర్ పేరుతో ఆధార్, పాన్ కార్డులు, ఉద్యోగ నియామక పత్రాలు తయారు చేశారు. అతని పేరుతో సురేశ్‌బాబు బెంగళూరులోని క్యాప్కో టక్నాలజీ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగం పొందారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లితండాకు చెందిన రమావత్ సురేశ్(29) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎల్బీనగర్లో నివసిస్తున్నాడు. ఇతనితో కుమ్మకై ్క ఐసీఐసీఐ బ్యాంకులో నకిలీ ప్లే స్లిప్‌లతో గంటల శంకర్ పేరుతో రూ.30 లక్షల రుణాన్ని మంజూరు చేయించుకున్నారు. ఇందుకుగాను రమావత్ సురేశ్‌కు రూ.6.70 లక్షలు కమీషన్ చెల్లించి, మిగిలిన డబ్బులను నిందితులు పంచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేగాక గంటల శంకర్ పేరుతో క్రెడిట్ కార్డు పొందిన రమావత్ సురేశ్ రూ.3 లక్షలు పరిమితిని వినియోగించుకున్నాడు. ఈ కేసులో మీర్పేట్ పరిధిలోని అల్మాస్‌గూడలో నివసించే గంటల శ్రీనివాస్(34)ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీ, వీటితో ఉద్యోగం పొందడం, బ్యాంకు రుణం పొందడం వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, నిందితులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో
ఉద్యోగం, బ్యాంకు రుణం
ఐసీఐసీఐ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి..
ఐదుగురు నిందితులకు రిమాండ్
వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం సీఐ


