దరఖాస్తు పెండింగ్‌ | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు పెండింగ్‌

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

‘సర్‌’ 69%.. ‘గ్రాడ్యుయేట్లు’ 80% ● ఓటరు జాబితాపై అధికారుల తాత్సారం

సాక్షి, సిటీబ్యూరో

ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఎందరో దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ, వాటి పరిష్కారంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఇటు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో, అటు గ్రాడ్యుయేట్‌ ఓటరు జాబితాలో రెండింటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

పడకేసిన పరిష్కారం

సర్‌ ప్రక్రియలో భాగంగా నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేయలేకపోయినవారు, అందజేసినా ముసాయిదా జాబితాలో పేరు లేనివారు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేనివారు కొత్తగా ఓటరు నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం (హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం) ఓటుకు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటి పరిశీలన, పరిష్కారంలో మాత్రం తీవ్రజాప్యం కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి.

సర్‌లో 11,984 దరఖాస్తులు

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో అక్టోబర్‌ 8 నుంచి గత వారాంతం వరకు ఓటరు జాబితాకు సంబంధించి మొత్తం 17,352 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,982 మాత్రమే ఆమోదం పొందాయి. 386 దరఖాస్తులు తిరస్కరించారు. ఇంకా 11,984 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే ఈ తాజా విడతలో అందిన దరఖాస్తుల్లో 69 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.

ఏ ఓటరైనా..

సర్‌, గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు సంబంధించి రెండు ప్రక్రియల గణాంకాలు వేర్వేరు కాలపరిమితులు, భౌగోళిక పరిధులకు సంబంధించినవే అయినప్పటికీ.. ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం కుంటుతుండటం గమనార్హం.

4.81 లక్షల పట్టభద్రులకు మోక్షమెప్పుడో?

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల్లో సభ్యత్వ నమోదు ప్రారంభం నుంచి గత వారాంతం వరకు 5,99,394 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,15,350 ఆమోదం పొందగా, 2,815 తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 4,81,229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇవి 80.29 శాతం. జిల్లాలవారీగా చూస్తే.. హైదరాబాద్‌లో 1,04,349 దరఖాస్తులకు 89,301, మేడ్చల్‌– మల్కాజిగిరిలో 1,41,808 దరఖాస్తులకు గాను 1,27,489 పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ వాటా ఈ రెండు జిల్లాల్లోనూ అధికంగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement