కాంగ్రెస్ పార్టీ నుంచి మధుయాస్కీగౌడ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి గెలుపొందారు. కానీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరుతో అధికారిక కార్యక్రమాల్లో ఆయన జోక్యమే అధికమైంది. ప్రజాస్వామ్య బద్ధంగా గెలుపొందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యే ఒకటి సూచిస్తే.. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరొకటి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తల పట్టుకుంటున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా ఉంది పలు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ అధికారుల పరిస్థితి. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. ఓటమిపాలై ఆ తర్వాత అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా చలామణీ అవుతున్న నేతల మధ్య నలిగిపోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలు.. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చెలాయిస్తుండటాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరికి అండగా నిలబడాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం వీరికే దాసోహమంటుండటంతో క్షేత్రస్థాయి అధికారులు ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ జరుగుతుండటాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిలదీస్తున్నా.. పట్టించుకున్న అధికారులే లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మహేశ్వరం, చేవెళ్లలో కాంటెస్టెడ్ అభ్యర్థులే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతున్నారు. కొడంగల్‌లో ముఖ్యమంత్రి సోదరులు షాడో ఎమ్మెల్యేలు, సీఎంలా చలామణీ అవుతున్నారు.
కొడంగల్‌లో తిరుపతిరెడ్డి జోక్యం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఆయన సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి సామంతరాజులుగా వ్యవహరిస్తున్నారు. వీరికి అధికారికంగా ఎలాంటి హోదా లేకపోయినప్పటికీ.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు సహా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు మొదలు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి, పారిశ్రామిక వాడలు, రేడియల్ రోడ్లలో భూములు కోల్పొయిన బాధితులకు చెక్కుల పంపిణీ వంటి అధికారిక కార్యక్రమాల్లో వీరే ప్రధానంగా కనిపిస్తున్నారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా స్వయానా జిల్లా ఉన్నతాధికారులే వీరికి ఎదురు వెళ్లి ఆహ్వానం పలుకుతుండటం వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వంలో వీరికి ఎలాంటి పదవులు, హోదాలు లేకపోయినా జెడ్ కేటగిరీ తరహా భద్రత కల్పించడం కూడా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ప్రసన్నం చేసుకునే విషయంలో ఏకంగా జిల్లా ఉన్నతాధికారులే ముందు వరుసలో నిలబడటంతో ద్వితీయ శ్రేణి, క్షేత్రస్థాయి చిరుద్యోగులు ఇష్టం లేకపోయినా పెద్దలను అనుసరిస్తుండటం గమనార్హం.
మహేశ్వరంలో కేఎల్లార్
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్), బీఆర్‌ఎస్ నుంచి పటోళ్ల సబితారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు పోటీ చేశారు. వీరిలో సబితారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఓటమి పాలైన కేఎల్లార్‌కు కలిసి వచ్చింది. ప్రొటోకాల్‌కు భిన్నంగా అధికారిక కార్యక్రమాల్లో ఆయన జోక్యం అధికమైంది. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, టీజీఐఐసీ, అధికారులు బదిలీలు మొదలు.. పోస్టింగ్‌ల వరకు ఇలా అన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఎలాంంటి హోదా లేకపోయినప్పటికీ.. కేవలం అధికార పార్టీ నాయకుడనే కారణంతో అధికారులు ఆయనకే దాసోహం అంటున్నారు. తన క్యాంప్ ఆఫీసు కేంద్రంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ పనుల్లోనూ అధికారుల కంటే ఈయన జోక్యమే ఎక్కువైందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నియోజకవర్గ బాధ్యులపై త్రీవ విమర్శలు
ఎమ్మెల్యేలుగా ఓడినా.. అధికారిక కార్యక్రమాల్లో హంగామా
అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పోస్టింగ్‌లు, బదిలీలూ వీరి కనుసన్నల్లోనే
మహేశ్వరం, చేవెళ్ల, కొడంగల్, ఎల్బీనగర్‌లో తరచూ ప్రొటోకాల్ రగడ
ఆధిపత్య పోరులో నలుగుతున్న కిందిస్థాయి అధికారులు


