రైస్ మిల్లుపై కేసు నమోదు..
మంచాల: పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి విక్రయిస్తున్న ఘటన మంచాల మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక శ్రీరాఘవేంద్ర రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమ దందా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ రామ్‌కుమార్, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి వనజారెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నేరుగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి, రిసైక్లింగ్ అనంతరం వివిధ రకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
వంద క్విటాళ్లకు పైగా..
ఒక్క రైస్ మిల్లులోనే వంద క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. రీసైక్లింగ్ చేసి వివిధ బ్రాండ్ల లేబుల్స్ ఉన్న బస్తాలో నింపుతున్నారు. సివిల్ సప్లయ్ శాఖ సరఫరా చేసిన రేషన్ బియ్యం బస్తాలను సైతం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మిల్లుకు కొద్దిదూరంలో ఉన్న ఓ షటర్లో 46.50 క్వింట్లాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన 250 ధాన్యం బస్తాలు సైతం లభ్యమయ్యాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అధికారులు దృష్టిసారించారు.
అన్నీ అక్రమాలే..
రైస్ మిల్లు నిర్వాహకుల వద్ద ఎలాంటి రిజిస్టర్లు లేవు. రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారు. ఎంత విక్రయించారు..? అనే వివరాలు లేవు. మిల్లుకు సంబంధించిన ఎలాంటి రశీదులు కూడా లేవు. బ్లాక్ దందా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తేలింది.
19 రకాల బ్రాండ్లతో విక్రయాలు
రేషన్ బియ్యాని రీసైక్లింగ్ చేసి, సన్నబియ్యంగా మార్చి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు. జేఎస్‌ఆర్, ఎస్‌ఎస్, ఎస్‌జేఎల్, కౌ బ్రాండ్, కర్నూల్, ఫైవ్ స్టార్, ముబారక్, వీజీఆర్, టమాటోగోల్డ్, బెస్ట్ హెచ్‌ఎంటీ, ఆర్‌ఆర్‌ఐ, గజరాజ్, సూర్య తేజ, జోకర్స్, అన్నపూర్ణ, సీతాజీ, వైష్ణవి, తాజ్‌మహల్ వంటి 19 రకాల బ్రాండ్లతో సంచులు ప్యాక్ చేసి ఉన్నాయి .
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున్న అక్రమ దందా కొనసాగిస్తున్న మంచాలలోని శ్రీరాఘవేంద్ర రైస్ మిల్లులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, సీజ్ చేస్తామని విజిలెన్స్ ఎస్పీ రామ్‌కుమార్, సివిల్ సప్లయ్ అధికారి వనజారెడ్డి తెలిపారు. మంచాలలో విలేకరులతో మాట్లాడుతూ.. మిల్లులో ధాన్యం తూకం వేసే మిషన్‌కు కూడా అనుమతి లేదని తెలిపారు. నిర్వాహకులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. తనఖీలో విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలోని పోచారం, ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు రైస్ మిల్లులపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. గణేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్, వైష్ణవి మిల్లులో నిల్వలను పరిశీలించారు. కొలతలు, తూకాల్లో మోసాలు ఉండటంతో గణేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై కేసు నమోదు చేశారు.
రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి విక్రయం
వివిధ బ్రాండ్ల పేరుతో బస్తాల ప్యాకింగ్
దాడులు నిర్వహించిన విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు
సీఎమ్మార్ ధాన్యం సైతం సీజ్


