ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి అండర్– 17 అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా డీఈఓ వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేసిన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభ వెలికితీసేందుకు పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అనంతరం డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. తొలిరోజు 1,500 మీటర్ల పరుగు పందెం పోటీ నిర్వహించారు. ఇందులో బాలుర విభాగం నుంచి ఎం.గణేష్(నల్లగొండ) ఎం.చరణ్ తేజ(ఆదిలాబాద్), వి.గణేశ్(రంగారెడ్డి), బాలికల విభాగంలో ఎండీ స్మిన్(కరీంనగర్), ఎం.రాజేశ్వరి(ఆదిలాబాద్), పి.నక్షత్ర(రంగారెడ్డి) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. కాగా, ఈ పోటీలు గురువారం కూడా కొనసాగనున్నాయి.
మీర్‌పేట: మత ప్రచారం చేస్తున్నారన్న కారణంతో మహిళలను దూషించి, దాడికి పాల్పడిన వ్యక్తిని బుధవారం మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ శోభన్ కథనం ప్రకారం. ఆగస్టు 6న అల్మాస్‌గూడ రాజీవ్‌గృహకల్ప సమీపంలోని మారుతీనగర్‌లో ఇద్దరు మహిళలు పిల్లలకు చాక్లెట్లు, ఓ మతానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఇది గమనించిన స్థానికుడు గొల్ల లక్ష్మీనారాయణ మహిళలను దూషిస్తూ, భౌతిక దాడిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం స్థానిక వాట్సాప్ గ్రూపులలో వైరల్ కావడంతో అరుణజ్యోతి అనే మహిళ మీర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు, దాడికి పాల్పడిన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఇరువర్గాల మద్దతుదారులు బుధవారం పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జీ చేసి, పలువురిని స్టేషన్‌కు తరలించారు.
మొయినాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు బ్యాంకర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(బీఐఆర్‌ఈడీ) సంస్థ డైరెక్టర్ మునువర్ అలీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్‌లోని బీఐఆర్‌ఈడీ కేంద్రంలో టైలరింగ్, బ్యూటీషయన్, జర్దోసీ మగ్గం కోర్సుల్లో 40 రోజులపాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు నవంబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9494963976, 9398524699 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చేవెళ్ల: ఇటీవల మంబైలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కరాటే టోర్నీలో చేవెళ్ల ప్రాంత విద్యార్థులు సత్తాచాటారు. ఇందుకు సంబంధించిన వివరాలను కరాటే మాస్టర్ కృష్ణ బుధవారం విలేకర్లకు వివరించారు. పది దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న టోర్నీలో జపాన్ షోటోకాన్ అసోసియేషన్ తరఫున కటాస్ విభాగంలో సిద్దు, అశోక్ ప్రథమ స్థానాలు సాధించగా అశోక్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారని తెలిపారు. మణిదీక్షిత్, సాత్విక్, కౌశిక్, రోహన్ ద్వితీయ స్థానాలు, గౌతమ్ కుమార్, మల్లికార్జున్‌లు తృతీయ స్థానాల్లో నిలిచారన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నేపాల్, జపాన్, చైనా, ఇంగ్లాండ్, రష్యా, ఇండోనేషియా, తదితర దేశాలనుంచి సుమారు మూడు వేల మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నట్లు వివరించారు.


