తుర్కయంజాల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25,26 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ కోరారు. ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను శుక్రవారం రాగన్నగూడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్మికులు, ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, యూనివర్సిటీలు, వైద్య, ఆరోగ్య రంగ సిబ్బంది, పెన్షనర్లు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్, హమాలీతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుర్కయంజాల్ కన్వీనర్ మండల సత్యనారాయణ, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు గుడ్ల వినోద్, నాయకులు నాగం ధర్మారెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి, కుంట వెంకట్ రెడ్డి, బద్దం చెన్నారెడ్డి, గుండ బాల్రాజ్, రాములు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


