ఇబ్రహీంపట్నం రూరల్: ప్రమాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాడానికి అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల వివరాలు పరిశీలించి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, మున్సిపాలిటీ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాల వాఖ, రవాణ, ట్రాఫిక్, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పని చేసేలా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, అవసరమైన చోట అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. రక్షణాత్మక డ్రైవింగ్ అలవర్చుకోవాలని, వాహనం నడిపేటప్పుడు పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై పాఠశాల విద్యార్థులు, కళాశాల యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
అదనపు కలెక్టర్ కిరణ్మయి


