న్యూస్‌రీల్
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు
శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ముట్టజెప్పారా సరి..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితులకు క్షేత్రస్థాయిలోని పలువురు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నివేదికలను సిద్ధం చేసేందుకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పట్టా భూములను అసైన్డ్‌గా నమోదు చేయడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సరిహద్దు, సర్వే నంబర్లలో దొర్లిన తప్పుల సవరణ, భూస్వభావం, కేటగిరీ, యజమానుల పేర్లలో దొర్లిన తప్పులను సరి చేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. ఇచ్చేందుకు నిరాకరించిన వారి ఫైళ్లకు కొర్రీలు పెట్టి.. సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందిన వాటిని కూడా పెండింగ్‌లో పెట్టి భేరసారాలకు దిగుతున్నారు. సాధారణ రైతులకు నిరాకరించి.. పైరవీకారులకు పెద్దపీఠ వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తహసీల్దార్ల వద్ద 12,369 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 3,211 ఆర్డీఓల వద్ద ఉన్నాయి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వద్ద ఏకంగా 6,932 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కలెక్టర్ వద్ద 2,041 ఉండటం విశేషం.
నివేదికలు పంపడంలో నిర్లక్ష్యం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా 17 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటి వరకు మెజార్టీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక ప్రతి సోమవారం నిర్వహించే శ్రీప్రజావాణిశ్రీకి సగటున 60 నుంచి 100 వరకు అర్జీలు వస్తుంటాయి. అధికారులు వాటిని క్షేత్రస్థాయికి పంపుతుంటారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజనిర్ధారణ చేసి తహసీల్దార్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆయన తన ఆఫీసులో ఉన్న భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత నివేదికను ఆర్డీఓకు పంపుతుంటారు. ఆయన తన వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి తుది నివేదికను అదనపు కలెక్టర్/ కలెక్టర్‌కు పంపుతుంటారు.
ఒక్కో దశలో ఒక్కో రేటు
క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికల ఆధారంగానే కలెక్టర్లు వాటిని ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేస్తుంటారు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ప్రభుత్వ పెద్దలు రంగప్రవేశం చేసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అడిగినంత ముట్టజెప్పిన వారికి ఆశించిన విధంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నిరాకరించిన వారి ఫైళ్లను పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ భూమి తమకు కాకుండా పోతుందోననే భయంతో బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించి వారు అడిగినంత ముట్టజెబుతున్నారు. ఆర్‌ఐ నుంచి అదనపు కలెక్టర్ వరకు ప్రతి దశలోనూ భారీ మొత్తం చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఓ అదనపు కలెక్టర్ సహా పలువురు తహసీల్దార్లు, ఆర్‌ఐలు ఏసీబీకి పట్టుబడటం తెలిసిందే. ఆర్థిక స్థోమత లేని పేద రైతులు తమ భూములను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
లక్షల్లో సమస్యలు.. వేలల్లో పరిష్కారాలు
భూ సమస్యలకు సంబంధించి ధరణి సహా ప్రస్తుత భూ భారతి పోర్టల్స్‌కు ఇప్పటి వరకు 4,10,269 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొయినాబాద్, చేవెళ్ల, షాద్‌నగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 1,12,782 భూ సమస్యలు ఉన్నట్లు తేలింది. వీటిలో 52,925 సమస్యలకు అధికారులు పరిష్కారం చూపించారు, మరో 41,177 అర్జీలను తిరస్కరించారు. ఇబ్రహీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల నుంచి 94,389 దరఖాస్తులు అందగా, వీటిలో 38,029 అర్జీలను ఆమోదించి మిగిలిన వాటిని తిరస్కరించారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, కందుకూరు మండలాల నుంచి 99,657 దరఖాస్తులు అందగా, 42,397 అర్జీలను ఆమోదించారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శంషాబాద్, గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల నుంచి 42,040 దరఖాస్తులు అందగా, వీటిలో 17,707 ఆమోదించి మిగిలినవి తిరస్కరించారు. షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కేశంపేట, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కొత్తూరు, జిల్లేడు చౌదరిగూడ, నందిగామ మండలాల నుంచి 61,401 దరఖాస్తులు అందగా, వీటిలో 28,003 ఆమోదించారు. అధికారులు తిరస్కరించిన వాటిలో మెజార్టీ భూములు ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయశాఖలకు సంబంధించినవే ఉండటం గమనార్హం.
ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 41లో 1,161 ఎకరాల భూమి ఉంది. దీనిలో 600 ఎకరాలకుపైగా రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. మరో 400 ఎకరాలు 150 మంది రైతుల చేతిలో ఉంది. బాండెడ్ లేబర్‌కు 82 ఎకరాలు సహా కోర్టు కేసులో 11 ఎకరాలు ఉంది. ఇప్పటికే రియల్టర్లు, నేతల చేతుల్లోకి వెళ్లిన 600 ఎకరాలను పట్టాగా మార్చేశారు. ఏళ్లుగా సాగులో ఉన్న 150 మంది రైతుల భూములను మాత్రం నిషేధిత జాబితాలో పెట్టారు. వారంతా భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. రైతుల చేతుల్లో ఉన్నవి పూర్తిగా పట్టాభూములేనని, నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 11న కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబించడం అనుమానాలకు తావిస్తోంది.
భూ భారతి పోర్టల్‌లో
పేరుకుపోయిన దరఖాస్తులు
క్షేత్రస్థాయిలో అందని నివేదికలు
24 వేలకుపైగా అర్జీలు పెండింగ్
కిందిస్థాయి మొదలు ఉన్నతాధికారుల వరకు ఇదే తంతు..
బాధితులకు తప్పని తిప్పలు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఇదీ భూ భారతి లెక్క..
పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులు: 4,10,269
ఇప్పటి వరకు పరిష్కరించినవి: 1,79,061
తిరస్కరించినవి: 1,56,298
తహసీల్దార్ల వద్ద పెండింగ్: 12,369
ఆర్డీఓల వద్ద: 3,211
అదనపు కలెక్టర్ వద్ద: 6,932
కలెక్టర్ వద్ద: 2,041
మొత్తం పెండింగ్: 24,553
డివిజన్ తహసీల్దార్లు ఆర్‌డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్
చేవెళ్ల 3,018 630 1,497 603
ఇబ్రహీంపట్నం 3,358 999 1,664 478
కందుకూరు 2,861 736 2,024 427
రాజేంద్రనగర్ 1,360 164 710 238
షాద్‌నగర్ 1,772 682 1,037 295


