షాద్‌నగర్: ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో శుక్రవారం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందే ఉద్యోగుల పీఆర్సీని ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వారికే తమ మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీని ప్రకటించడంతో పాటు పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సరాపు జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్మాన్, నాయకులు సుధాకర్‌రెడ్డి, జనార్దన్, కృష్ణయ్య, నర్సింలు, రమేష్, పాండు, అబ్దుల్ గఫార్, నందిగామ సురేష్ పాల్గొన్నారు.
కొత్తూరు: సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 641ను రద్దు చేసే వరకు దీక్షలు కొనసాగుతాయని జేఏసీ అధ్యక్షుడు రాంబాల్‌నాయక్ స్పష్టం చేశారు. గ్రామంలో కొనసాగుతున్న దీక్షలు శుక్రవారంతో 20 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంప్‌యార్డు ఏర్పాటుతో సమీపంలోని 50 గ్రామాల్లో ప్రజలు అన్ని రకాలుగా నష్టపోతారని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే జవహర్‌నగర్ డంప్‌యార్డుతో పెద్ద ఎత్తున జల, వాయు, ఇతర కాలుష్యాలు వెలువడుతున్నట్లు ఇటీవలే ఆరోగ్య సంస్థలు చేసిన పరిశోధనల్లో తేలిందన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా సాంకేతికత పేరుతో డంప్‌యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, మహేశ్, రాజేందర్‌రెడ్డి, శ్రీధర్‌చారి, నరేందర్‌రెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.
తుర్కయంజాల్: అక్రమంగా మట్టి తవ్వకం, తరలింపు చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవని మైనింగ్ సర్వేయర్ సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె ఆర్‌ఐలు ఇందిర, వెంకన్నతో కలిసి ఆదిభట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడ లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌లో అనుమతులు లేకుండా చేపడుతున్న మైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మైనింగ్ నిర్వాహకులు గతంలో అనుమతలు పొందిన దాని కంటే అదనంగా మట్టిని తవ్వినందుకు జరిమానా విధించినట్టు తెలిపారు. అయినా తీరు మార్చుకోకుండా యథావిధిగా రాత్రి వేళల మైనింగ్ చేపడుతున్నట్లు గుర్తించామన్నారు. కొలతల ఆధారంగా మరోసారి జరిమానా విధించడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు.


