న్యూస్‌రీల్
మళ్లీ నోటీసులిస్తాం
అవకతవకలు.. బియ్యం అక్రమ రవాణా, సీఎంఆర్ సేకరణలో అవకతవకలు అరికట్టడమే లక్ష్యమని సివిల్ సప్లై అధికారులు తెలిపారు.
కదిలిస్తారా..
జిల్లా విద్యాశాఖలో అంతర్గత డిప్యూటేషన్ల రగడ
● డీఈఓ ఉత్తర్వులు బేఖాతార్ చేస్తున్న ఉపాధ్యాయులు
● 271 మందికి ఉత్తర్వులు.. ఇప్పటికీ జాయిన్ కాని 52 మంది
● పలువురు హెచ్ఎంలు, ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు
● తాజాగా మరోసారి జారీ చేసే యోచనలో జిల్లా విద్యాశాఖ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మాటవినకుండా మొండికేస్తున్న ఉపాధ్యాయుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. నోటీసులకు స్పందించని ఉపాధ్యాయులకు రెండోసారి కూడా సంజాయిషీ నోటీసులు జారీ చేసి తర్వాత వారిపై వేటు వేయాలని భావిస్తోంది. జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులు లేకపోవడం, సబ్జెక్టు టీచర్ల కొరతతో పాఠ్యాంశాల బోధన ఇబ్బందిగా మారుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు జిల్లా విద్యాశాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయుల అంతర్గత సర్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 271 మందికి స్థానచలనం కల్పించింది. ఈ మేరకు రిలీవింగ్, జాయినింగ్ ఆర్డర్స్ సైతం జారీ చేసింది. ఇంటికి సమీపంలోని పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు ఇందుకు ససేమిరా అంగీకరించడం లేదు. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన చోటే పని చేస్తామని, మరో చోటికి వెళ్లబోమని భీష్మించి కూర్చొన్నారు. ఇప్పటి వరకు 212 మంది కేటాయించిన పాఠశాలల్లో చేరారు. మరో ఏడుగురు ప్రస్తుతం పని చేస్తున్న ప్రదేశంలోనే పదవీ విరమణ చేశారు. 52 మంది ఇప్పటికీ జాయిన్ కాలేదు. వీరితో పాటు రిలీవ్ చేయకుండా అడ్డుకుంటున్న 83 మంది ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. తొలి విడతలో నోటీసులు అందుకున్న వారిలో 41 మంది ఇప్పటికే లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. మరో 11 మంది ఉపాధ్యాయులు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదు. వీరిని దారిలోకి తేవాలంటే రెండోసారి కూడా నోటీసులు ఇవ్వాలని, అయినా స్పందించకపోతే నెలవారీ వేతనం నిలిపివేయడంతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది.
పోస్టింగ్ ఒక చోట.. విధులు మరోచోట
ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు, ఉన్నతాధికారుల ఫైరవీలతో పలువురు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ ఆర్డర్లు తెచ్చుకున్నారు. వీరంతా పిల్లల ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు, వృద్ధ తల్లిదండ్రులకు సేవలు, అనారోగ్య సమస్యలను కారణంగా చూపించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ ఆర్డర్స్‌తో ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు సొంత జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు సైతం డిప్యూటేషన్లపై వచ్చి కూర్చొన్నారు. ఆదిలాబాడ్, నల్లగొండ, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నారాయణపేట్, నాగర్‌కర్నూలు, వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన వారు 34 మంది ఉన్నారు. ఇక సొంత జిల్లాలోని ఒక మండలం నుంచి మరో మండలానికి అంతర్గత డిప్యూటేషన్లపై వెళ్లిన వారు మరో 40 మంది ఉన్నారు. వీరంతా మారుమూల మండలాల్లో (చేవెళ్ల, మంచాల, కందుకూరు, మాడ్గుల, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, షాబాద్, చౌదరిగూడ, తలకొండపల్లి, ఆమనగల్లు, కేశంపేట, కొత్తూరు) గ్రామాల్లో పోస్టింగ్‌లు పొంది.. నగరంలోని ఇంటికి సమీపంలో ఉన్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, గండిపేట్, బాలాపూర్, హయత్‌నగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై వచ్చి చేరారు. పిల్లల నిష్పత్తికి మించి అవసరం లేకపోయినా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అడ్డదారుల్లో వచ్చి ఫోకల్ పోస్టులు పొందినవారి డిప్యూటేషన్ ఆర్డర్లను ప్రభుత్వం రద్దు చేసింది. సొంత స్థానానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వీరిలో కొంత మంది ఇప్పటికీ రిలీవ్ కాకుండా అదే స్థానంలో కొనసాగుతుండటం విశేషం.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలువురు ఉపాధ్యాయులను అంతర్గతంగా సర్దుబాటు చేశాం. ఒక మండలం నుంచి సమీపంలోని మరో మండలానికి కేటాయించాం. వీరితో పాటు డిప్యూటేషన్ ఆర్డర్లను రద్దు చేసినా రిలీవ్ కాకుండా ఇక్కడే కొనసాగుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నాం. వేతనాలు నిలిపివేయడంతో పాటు విధుల నుంచి సస్పెండ్ చేయడానికి వెనుకాడబోం. విధి నిర్వహణలో మరింత నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదు.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి


