ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

● ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి

● తాగునీరు, వ్యవసాయం, పశుగ్రాసం, విద్యుత్‌ సరఫరాపై దృష్టి సారించండి

● ఉమ్మడి జిల్లా అధికారుల సమీక్షలో ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్‌నినో ప్రత్యేక అధికారి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్‌–మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, ఉద్యానవన శాఖ, తాగునీటి సరఫరా, విద్యుత్‌, నీటిపారుదల తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి, మేడ్చల్‌ కలెక్టర్‌ మను చౌదరి, వికారాబాద్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితీష్‌ వి.పాటిల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, వర్షపాతం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ, తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని, వ్యవసాయంతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని పేర్కొన్నారు. వేసవిలో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీటి సరఫరా వ్యవస్థలు సజావుగా పనిచేసేలా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లాలకు సంబంధించిన సమస్యలు, అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందించాలని సూచించారు. సమావేశంలో మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ ఫైజల్‌ అహ్మద్‌, వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌, మేడ్చల్‌ రెవెన్యూ అధికారి మాలతి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement