మొయినాబాద్: ఇళ్ల స్థలాలకోసం 113 రోజుల పాటు రిలే దీక్ష చేసిన హిమాయత్‌నగర్ గ్రామస్తులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీతో విరమించారు. మున్సిపాలిటీలోని హిమాయత్‌నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 151లో 19 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకు అప్పగించాలంటూ యువజన సంఘాల ఆధ్వర్యంలో 113 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీంభరత్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కంజర్ల భాస్కర్, బీఆర్ఎస్ నాయకుడు రవియాదవ్ తదితరులతో కలిసి గ్రామస్తులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్దకు వెళ్లారు. ఆయనతో ఇళ్ల స్థలాల విషయంపై చర్చించారు. దసరా పండుగ తరువాత గ్రామస్తులకు న్యాయం చేస్తామని.. ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం భీంభరత్, ఇతర నాయకులు కలిసి దీక్ష చేస్తున్నవారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు మాణయ్య, యువజన సంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
113 రోజుల దీక్ష విరమణ


