తుక్కుగూడ: అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం నుంచి జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ పోషణ మాసం–2026కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన అంగన్‌వాడీ.. మన బాధ్యత’ అంశంతో అక్టోబర్ 9వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. చిన్నారులకు అందించే సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, వారి సంరక్షణ, అభ్యసనం, ఆటలు, తల్లులకు అందించే పౌష్టికాహారం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుడు బండి నర్సింహ్ సన్మానించారు. గౌతమ్‌కుమార్ ఇటీవల ట్రెసా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అల్తాఫ్ హుస్సేన్, సయ్యద్ అయూబ్ తదితరులు ఉన్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కవ్వగూడ కార్యదర్శి వజ్రలింగం తప్పుడు ఆరోపణలతో తనపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని ఎంపీఓ రమేష్ పేర్కొన్నారు. కవ్వగూడ సర్వే నంబర్ 412,414,415,416,429,432,438లోని భూములు పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటాయని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేవని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శిపై గతంలో చార్జి మెమో కూడా జారీ చేశామని తెలిపారు. అది జీర్ణించుకోలేకే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా తనపై ఆరోపణలు చేసిన సదరు కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.


