కడ్తాల్: మైదాన ప్రాంత గిరిజనులతో పాటు, బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బంజారా సేవాదళ్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరాథోడ్ మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనుల సమగ్రాభివృద్ధికి బోర్డును ఏర్పాటు చేయాలని, రాబోయే డీలిమిటేషన్‌లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సిద్ధాపూర్ డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించాలని, జీఓ నంబర్ 641ను పునః సమీక్షించాలని, ఫ్యూచర్‌సిటీలోని 20 ఎకరాల స్థలంలో సంత్ సేవాలాల్ భవ్య మందిరం నిర్మించాలని, 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేలా, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో బంజారా సేవాదళ్ అధికార ప్రతినిధి సురేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్, నాయకులు హనుమంత్ నాయక్, లక్ష్మణ్ నాయక్, పాపియా నాయక్ ఉన్నారు.


