వికారాబాద్: భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు ఆందోళనతో ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది నీరు పాతాలానికి చేరింది. గతేడాది ఆగస్టు చివరన జిల్లాలో సగటున 6.57 మీటర్లు ఉండగా ఈ ఏడాది 11.73 మీటర్ల లోతుకు పడిపోయాయి. వర్షాకాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వేసవి పరిస్థతి ఎలా ఉండబోతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నీటి లభ్యతకు కారణాల అన్వేషణ
జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో సగటున 25.56 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇది వేసవి సీజన్‌కు చెందిన మార్చి, ఏప్రిల్ మాసాలతో సమానమవడం ఆందోళన కలిగించే విషయం. కోట్‌పల్లి మండలంలో అత్యల్పంగా 6.40 మీటర్ల లోతులోనే నీళ్లు ఉన్నాయి. దోమ, మర్పల్లి మండలాల్లోనూ 18–20 మీటర్ల లోతుకు అడుగంటాయి. కోట్‌పల్లి మండలంలో నీటి లభ్యతకు కారణాలను విశ్లేషించి మిగిలిన మండలాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన లఖ్నాపూర్, కోట్‌పల్లి, జుంటుపల్లి, శివసాగర్ లాంటి ప్రాజెక్టులు మినహా చిన్న చిన్న చెరువులు, కుంటలు ఇప్పుడే అడుగంటుతున్నాయి.
వర్షాభావ పరిస్థితులే కారణం
ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి తలెత్తిన వర్షాభావ పరిస్థితుల కారణంగానే భూగర్భజలాలు అడుగంటుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 12 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో అత్యధిక లోటు వర్షపాతం, ఒక మండలంలో అధిక వర్షపాతం, ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు 533 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం 409 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలు మచ్చుకై నా కనిపించడం లేదు. జిల్లాలో వేలల్లో ఇంకుడు గుంతలు తవ్వించామని అధికారులు చెబుతున్నా.. వాటి నిర్వహణ గాలికొదిలేశారు. చెక్ డ్యామ్‌లు, ఫాంఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవటంతో అవి నామమాత్రంగా మారాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా అడుగంటి పోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోరు బావులు తవ్వుతున్నారు. వాతావారణ పరిస్థితులు, నీటి లభ్యత లాంటి విషయాలపై అవగాహన లేకుండా బోర్లు వేయడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కొందరు రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు వినియోగించి బోరుబావుల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భజలాల నీటి మట్టాలు పడిపోతున్నాయి. పంటలు ఎండుముఖం పట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో కరువు ముదిరే ప్రమాదం కనిపిస్తోంది.
నీటి పొదుపు సామాజిక బాధ్యత
భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. ఇంకుడు గుంతలు తవ్వి నిర్వహణ చేపట్టాలి. కుంటలు, చెరువులు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లలో పూడిక తీసి నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో అనుమతులు లేకుండానే బోరుబావులు తవ్వుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే పరీక్షలు నిర్వహించి రిపోర్టు ఇస్తాం. దీంతో బోరుబావులు తవ్వుకునే వారు నష్టపోకుండా ఉంటారు.
– రవి, జిల్లా అధికారి, గ్రౌండ్ వాటర్
ముంచుకొస్తున్న జల సంక్షోభం
అడుగంటుతున్న భూగర్భ జలాలు
13 మండలాల్లో లోటు వర్షపాతం
ఆందోళనలో ప్రజలు


