అక్రమార్కుల తిష్ట! | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కుల తిష్ట!

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

ఉపేక్షించేది లేదు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత భూముల జాబితా (22ఏ)పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పట్టా భూములను ఈ జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. కొంత మంది ఫైరవీకారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమాయకులను మభ్య పెట్టి అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు.

మేం ఎంత చెబితే అంత..

జిల్లాలోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, బాలాపూర్‌ మండలాల పరిధిలో మూడు వేల ఎకరాలకుపైగా భూములు కొత్తగా నిషేధిత జాబితాలో చేరాయి. వీటిలో ఏళ్ల క్రితమే వెలసిన హుడా లే అవుట్లు, ఖాళీ స్థలాలు, నివాసాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రి బిల్లుల చెల్లింపు కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల పేరుతో ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి తీరా ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టినట్లు తెలిసి మనోవేదనకు గురవుతున్నారు. తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కొనుగోలుదారులు ఒత్తిడి తెస్తుండటంతో చేసేది లేక ఆయా కార్యాలయాల సమీపంలోని ధరణి ఆపరేటర్లు సహా డాక్యుమెంట్‌ రైటర్లు, ఇతర ఫైరవీకారులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల బలహీనతను వారు క్యాష్‌ చేసుకుంటున్నారు. ‘ఫలానా అధికారి తనకు చాలా దగ్గర అని, తాను ఎంత చెబితే అంత’ అని నమ్మబలుకుతున్నారు. సరూర్‌నగర్‌లోని ఓ ఫైరవీకారుడు ఏకంగా కలెక్టరేట్‌లోని సెక్షన్‌ ఆఫీసులు తిరిగి ఫొటోలు, లొకేషన్లు బాధితులకు షేర్‌ చేసినట్లు తెలిసింది.

ఆ క్రెడిట్‌ తమదేనంటూ వసూళ్లు

దిద్దుబాటు చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు, వాటి పూర్వ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) నుంచి పట్టా భూములుగా మారిన సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించి, నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఒక్కో రెవెన్యూ పరిధిలో 40 వేల నుంచి 50 వేల చదరపు గజాల విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి, ఆ మేరకు వాటికి సంబంధించిన జీఓలు, కోర్టు ఉత్తర్వులు, మెమోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. నిజానికి ఎలాంటి ఫైరవీలతో పని లేకుండానే అధికారులే స్వయంగా దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే కొన్నింటిని ఆ జాబితా నుంచి తొలగించారు. ఫైరవీకారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. తమ కృషితోనే ఆ జాబితా నుంచి బయటపడిందని పేర్కొంటూ అక్రమ వసూళ్లకు దిగుతున్నారు. ఈ అంశం క్షేత్రస్థాయిలోని పలువురు అధికారుల దృష్టికి సైతం వెళ్లింది. లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చేందుకు బాధితులు ముందుకు రాకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్నారు.

‘22 ఏ’ను క్యాష్‌ చేసుకుంటున్న మాయగాళ్లు

నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తామని మాయమాటలు

అమాయకులను మభ్యపెట్టి వసూళ్ల పర్వం

నమ్మి మోసపోవద్దంటున్న రెవెన్యూ అధికారులు

నిషేధిత భూముల జాబితా (22 ఏ) చుట్టూ అక్రమార్కులు తిష్టవేశారు. రెవెన్యూలోని కీలక అధికారులతో తనకు పరిచయం ఉందని, తాము అడిగినంత ముట్టజెబితే జాబితా నుంచి విముక్తి కల్పించే విధంగా చేస్తామని నమ్మబలికి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ సహా డివిజనల్‌ రెవెన్యూ, మండల రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. అదే పనిమీద ఉన్నామంటూ నమ్మించేందుకు అక్కడి నుంచి బాధితులకు ఫొటోలు, లొకేషన్లు షేర్‌ చేస్తున్నారు.

ఏదైనా సమస్య ఉంటే బాధితులే స్వయంగా తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసి విన్నవించాలి. సంబంధిత అధికారులకు అర్జీలు అందజేసిన 48 గంటల్లోనే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు. 22 ఏ జాబితా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు దృష్టికి తెస్తే సదరు వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఇప్పటికే 765 జీవోలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాం. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ వేలం వేసిన భూముల వివరాలను సైతం సేకరించి, వాటిని జాబితా నుంచి తొలగిస్తున్నాం. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూములు, అవార్డీల వివరాలను కూడా సేకరించి జాబితా నుంచి తొలగిస్తున్నాం.

– కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement