షాద్‌నగర్: పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం జారీ చేసిన చేసిన జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు రిషబ్ జైన్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి సోమవారం పట్టణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం బలోపేతం చేయకుండా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాల విలీన నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని అన్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించి మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో విలీనం చేసే కుట్రలు విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శివప్రసాద్, చింతల పవన్, నర్సింహ, పరమేశ్వర్, బాలు, రాజు, రాంమోహన్‌రెడ్డి, చింటు తదితరులు పాల్గొన్నారు.


