సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం క్యామ మల్లేశ్‌కు పరామర్శ విద్యార్థుల ఉన్నతికి ప్రయోగాత్మక విద్య దోహదం సంచార జాతుల అభ్యున్నతికి కృషి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించే వినతులను సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: ఇటీవల అస్వస్థతకు గురైన బీఆర్‌ఎస్‌ భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి క్యామ మల్లేశ్‌ నివాసానికి సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌రావు

షాద్‌నగర్‌రూరల్‌: విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించడం ద్వారా వారిలో ఆలోచనా విధానం పెంపొందుతుందని జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బూర్గులలో ప్రగతి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం సైన్స్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ (మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ వాహనం) ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక, సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు సైన్స్‌ ల్యాబ్‌ ఆన్‌వీల్స్‌ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ మొబైల్‌ వాహనం ప్రతిరోజు ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శిస్తూ విద్యా ర్థులు సైన్స్‌ ప్రయోగాలను స్వయంగా నిర్వహించి నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్‌, ఎంవీ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ వెంకట్‌రెడ్డి, విశ్రాంత ప్రధానోపాద్యాయుడు జనార్దన్‌, ప్రగతి వెల్ఫేర్‌ సొసైటీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రాజెక్టు మేనేజర్‌ అరుణ్‌, బూర్గుల ఉపసర్పంచ్‌ శివలీల, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు కేశురాం పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో సంచార జాతుల 75వ విముక్తి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. విద్య ద్వారా యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి, నైపుణ్యావృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంచార విముక్తి జాతుల హక్కులు, వారి చారిత్రక నేపథ్యం, సమాజ అభివృద్ధిలో వారి పాత్రపై సంచార జాతుల నాయకులు కుమార్‌ మహేంద్ర, ఒంటెద్దు నరేందర్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంచార జాతుల నాయకులు డేరంగుల కృష్ణ, రామస్వామి, ఓరుగంటి రమేష్‌, వరికుప్పల సుధాకర్‌, పన్నీరు నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement