గంటల తరబడి మొబైల్ మాయలో.. సరదాగా మొదలై వ్యసనంగా మారి.. ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల నడవడిక బాల్యం బాట తప్పితే.. భవిష్యత్ ప్రశ్నార్థకం
కేశంపేట: బాల్యం అంటే ఆటపాటలు.. చదువులు.. భవిష్యత్ లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన దశ. అలాంటి దశలో కొందరు మైనర్ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా లభించడం, బెల్టుషాపులపై నిఘా లేకపోవడం.. మరోవైపు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, చెడుసావాసాలతో దారి తప్పుతున్నారు. ఇంకోవైపు సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వినోదానికి అధిక సమయం కేటాయిస్తూ చక్రబంధంలో ఇరుక్కుపోతున్నారు.
విచ్చలవిడి మద్యంతో..
పల్లెల్లో అనధికారికంగా మద్యం విక్రయించే బెల్టుషాపులు చాలా ఉన్నాయి.మైనర్లకు మద్యం అందకుండా నిఘా ఉండటం లేదు.బెల్టుషాపు నిర్వా హ కులు వ్యాపార ధోరణితో మైనర్లు అని కూడా చూడకుండా మద్యం విక్రయిస్తున్నారు. మద్యానికి అలవాటు కావడంతో వారి చదువు, ప్రవర్తన, లక్ష్యంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు విద్యార్థులు స్నేహితుల సాన్నిహిత్యంతో సిగరెట్లు, పొగాకు ఉత్పతులవైపు ఆకర్షితులవుతున్నారు. మొదట్లో సరదాగా అనిపించినా రానురాను వ్యసనంగా మారుతోంది. చిరుప్రాయంలోనే జీవితాలు ‘పొగ’బారుతున్నాయి.
ఫోన్ అవసరమా? వ్యసనమా?
ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. విద్యార్థులకు పాఠ్యాంశాలు, విద్యా సమాచారం, ఆన్‌లైన్ తరగతులకు దోహదం చేస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా అవసరానికి మించి గంటల తరబడి ఫోన్‌తోనే గడపడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వీడియోలు, ఆన్‌లైన్ వినోదం, గేమ్స్ వంటి వాటితో సమయం తెలియకుండా గడిపేస్తూ చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు.
బాల్యాన్ని కాపాడుకుందాం..
చిన్నతనంలోనే మద్యం, పొగాకు, మత్తు పదార్థాల తో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను ఇటు తల్లిదండ్రులతో పాటు అటు ఉపాధ్యాయులు, సమాజంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలంటున్నారు. మైనర్లను చెడు అలవాట్ల నుంచి కాపాడితేనే భావిభారత పౌరులుగా ఎదుగుతారని చెబుతున్నారు.
మద్యం, సిగరెట్లు, మత్తు పదార్థాలకు అలవాటు
అవగాహన కల్పిస్తున్నాం
మద్యం, సిగరెట్లు వాడడం ద్వారా కలిగే అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. చెడు అలవాట్లతో విద్యార్థులు భవిష్యతును నాశనం చేసుకోవద్దు.
– నరహరి, ఎస్‌హెచ్‌ఓ, కేశంపేట
క్రమశిక్షణ ముఖ్యం
విద్యార్థులు చదువులో రాణించేందుకు కష్టపడాలి. మొబైల్‌ఫోన్‌ను విద్యా సమాచారం కోసమే వినియోగించాలి. మద్యం, మత్తుకు బానిసలై విలువైన జీవితాన్ని కోల్పోవద్దు. చదువు, క్రీడల్లో రాణించి క్రమశిక్షణతో ముందుకు సాగాలి.
– రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీడీఓ, కేశంపేట


