ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా 22 ఏ నిషేధిత జాబితా భూముల్లో తప్పిదాలు జరిగాయని, సమగ్ర విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. నిషేధిత జాబితాలో జరిగిన అవకతవకలు, మార్పులు చేర్పులపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ఏకంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిషేధిత జాబితాపై తప్పు జరిగిందని ఒప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలన్నారు. 22ఏ జాబితాలో భారీగా భూములు చేరడం వెనుక కుట్ర దాగి ఉందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందేనన్నారు. 22ఏలో భూములను పెట్టి దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు మల్లారెడ్డి, మల్లేష్ యాదవ్, నవ జీవన్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్, కొప్పు బాషా తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్


