మీర్‌పేట: సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం, సమాచార కమిషన్, ప్రజాసంఘాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముదిరాజ్ అన్నారు. బాలాపూర్ చౌరస్తాలోని కార్యాలయంలో సోమవారం కమిటీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. ప్రజలకు సమాచారం వేగంగా, పారదర్శకంగా అందే విధంగా వ్యవస్థలో అవసరమైన మార్పులు తేవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గ్రామానికి సమాచార హక్కు ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, కార్యదర్శి తోట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్‌రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


