ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు శాఖల వారీగా స్పందించి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 136 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద, వివిధ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
సంచార పశు వైద్యశాలను వినియోగించుకోవాలి
కందుకూరు: సంచార పశు వైద్యశాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని 1962 అంబులెన్స్ కార్యనిర్వహణ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ సాహెబ్ సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పశువులకు అందించిన చికిత్సలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో వివిధ జబ్బులతో ఉన్న పశువులను ఆస్పత్రులకు తరలించలేని స్థితిలో ఉంటే ఒక్క ఫోన్ కాల్‌తో 1962 అంబులెన్స్ సిబ్బంది అక్కడికే వచ్చి వైద్యం అందిస్తారన్నారు. కార్యక్రమంలో అంబులెన్స్ జిల్లా కార్యనిర్వాహక అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్ సర్కిల్‌లో విద్యుత్ వ్యవస్థ బలోపేతం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రజలకు నాణ్యమైన, ని రంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ తుర్కయంజాల్ సబ్‌స్టేషన్ లోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (పీటీఆర్)–1 సామ ర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచింది. సామర్థ్య పెంపు పనులను విజయవంతంగా పూర్తి చేసి సోమవారం సాయంత్రం పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా ఛార్జ్ చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ సామర్థ్య పెంపు చేపట్టారు. దీంతో సబ్‌స్టేషన్‌పై లోడ్ ఒత్తిడి తగ్గడంతో పాటు పీక్ డిమాండ్ సమయాల్లో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. ఈ సామర్థ్య పెంపుతో తుర్కయంజాల్ గ్రామం, బ్రాహ్మణపల్లి, ఖమ్మగూడం, శోభానగర్, రాగన్నగూడ ప్రాంతాల్లోని సుమారు 10,000 మంది విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఆయా ప్రాంతాల్లో మెరుగైన ఓల్టేజ్‌తో పాటు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అప్‌గ్రేడేషన్ దోహదపడుతుంది. సరూర్‌నగర్ ఎస్‌ఈ లక్ష్మీనారా యణ, ఇబ్రహీం పట్నం డీఈ నరేష్ కుమార్, లైన్స్ విభాగం డీఈ వేణుగోపాల్, ప్రొటక్షన్ విభాగం డీఈ హైమనందతో పాటు ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి అనువైన భవనం చూడండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం మెడికల్ కాలేజీ కోసం అనువైన భవనాన్ని పరిశీలించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలోని ఓ అసంపూర్తి అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వైద్య విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై సోమవారం ‘సాక్షి’లో ‘కాలేజీ.. ఏ క్యాజీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీఎంఈ స్పందించారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అనువైన భవనాన్ని ఎంపిక చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.


