దోమ: వానాకాలంలో విష సర్పాలు, తేళ్ల సంచారం ఎక్కువ. పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము, తేలు కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం కాకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు. ఆందోళనకు గురైతే గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 33 మంది పాముకాటు బారిన పడి మృతి చెందారు. మరో 692 మందికి ఏఆర్‌వీ వ్యాక్సిన్ ఇచ్చారు.
నాటు వైద్యం వద్దు
వేసవిలో ముళ్ల పొదలు, రాళ్ల మధ్యలో దాగి ఉన్న పాములు, తేళ్లు వర్షాలు కురవడంతో బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా పొలాలు, గడ్డి, రాళ్ల కుప్పల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు వాటి కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. పాము కాటు వేసిన వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచి సమీప ఆస్పత్రికి తరలించాలి. భయపడితే గుండె వేగంగా కొట్టుకోవడంతో విషం శరీరమంతా త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాయాన్ని బ్లేడ్‌తో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం వంటి చర్యలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. చేతికి ఉంగరాలు, గడియారాలు, బిగుతైన దుస్తులు ఉంటే వెంటనే తొలగించాలి.
ఆ తేళ్లు ప్రమాదకరం
పంట పొలాల్లో ఎక్కువగా ప్రమాదకర తేళ్లు బయటకు వస్తుంటాయి. నల్ల తేలు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి, వాపు, మంట కలుగుతుంది. ఎరుపు తేలు కాటు గుండె, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పసుపు రాతి తేళ్లు, చెక్క దిమ్మెల కింద ఎక్కువగా కనిపిస్తాయి. వీటి కాటు కూడా నిర్లక్ష్యం చేయరాదు. తేలు కుట్టిన శరీర భాగాలను సబ్బుతో శుభ్రంగా కడిగి ఐస్‌ప్యాక్ ఉంచాలి. కుట్టిన భాగాన్ని ఎక్కువగా కదపకుండా ఉంచి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వర్షా కాలంలో విషసర్పాలు, తేళ్ల బెడద
కాటేస్తే ప్రథమ చికిత్స తప్పనిసరి
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 33 మంది మృతి


