మోయలేని భారం | - | Sakshi
Sakshi News home page

మోయలేని భారం

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు

ప్రైవేట్‌ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువ నోట్‌బుక్స్‌ ఇవ్వకూడదు. ప్రాజెక్టు బుక్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌ పాఠశాలలోనే ఉంచుకునేలా యజమాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను ఇబ్బందులకు గురి చేయకూడదు.

– వెంకట్‌స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్‌

దౌల్తాబాద్‌: బడికి వెళ్లే చిన్నారులు రోజురోజుకూ స్కూల్‌ బ్యాగుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సొంత సిలబస్‌ పేరుతో అధిక సంఖ్యలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, గైడ్లు, ప్రాజెక్ట్‌ ఫైళ్లు, డ్రాయింగ్‌, స్క్రాప్‌ బుక్స్‌ వంటి వాటిని తప్పనిసరి చేయడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌, బూట్లు తదితర వస్తువులు కూడా బ్యాగు బరువును మరింత పెంచుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధను చూసి స్వయంగా బ్యాగులు మోసి పాఠశాల వరకు తీసుకెళ్తున్నారు.

పరిస్థితి ఆందోళనకరం

మండలంలోని 33 గ్రామపంచాయతీల పరిధిలో 50 పాఠశాలలు ఉండగా, వాటిలో 6 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. గతంలో కొన్ని సబ్జెక్టుల పుస్తకాలు, ఒక రఫ్‌ బుక్‌తో సరిపెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక నోట్‌బుక్‌తో పాటు గైడ్లు, ప్రాజెక్ట్‌ వర్క్‌, రికార్డులు, డైరీలు వంటి పుస్తకాలు తీసుకు రావాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 6 నుంచి 12 కిలోల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు 12 నుంచి 18 కిలోల వరకు బరువున్న బ్యాగులను నిత్యం మోస్తున్నారు. కొన్ని పాఠశాల బస్సులు గేట్‌ వరకు మాత్రమే వెళ్లడంతో, అక్కడి నుంచి బ్యాగులు మోసుకుంటూ నడవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చిన్నారుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమలుకాని మార్గదర్శకాలు

విద్యార్థులపై బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విద్యాశాఖ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 1.5 కిలోలు, 3 నుంచి 5వ తరగతుల వారికి 3 కిలోలు, 6, 7 తరగతుల వారికి 4 కిలోలు, 8 నుంచి 10వ తరగతుల వారికి 5 కిలోలు మించకూడదని స్పష్టం చేసింది. అయితే ప్రైవేట్‌ పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా సొంత సిలబస్‌ పేరుతో అదనపు పుస్తకాలను విద్యార్థులపై మోపుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో బ్యాగుల బరువుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.

బడి పిల్లలపై బ్యాగు బండ

విద్యార్థులపై పెరుగుతున్న పుస్తకాల మోత

ప్రైవేట్‌ పాఠశాలలో మరింత బరువు

తిప్పలు పడుతున్న చిన్నారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement