కందుకూరు: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థి తులను ఎదుర్కోవాలంటే ప్రతి ఇంటికీ తప్పనిసరి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల పరిధిలోని కొత్తూర్‌లో సర్పంచ్ మండల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జలసిరి కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకోవాలని అన్నారు. గ్రామానికి ఒక ఊట కుంట, బోరు బావుల రీచార్జీ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటితో వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలు కాపాడుకోవచ్చని, భూగర్భ జలాల మట్టం పడిపోకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఇన్‌చార్జి ఎంపీఓ శ్రీధర్, టీఏ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి జానకీరామ్, ఉప సర్పంచ్ రవికుమార్‌రెడ్డి, ఏఈఓ స్వాతి, ఐకేబీసీసీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మాతృమరణాలపై దృష్టి పెట్టాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మాతృ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. మరణాలకు దారి తీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సోమవారం జిల్లాలో నమోదైన మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రసవానికి ముందు.. తర్వాత అందే వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ.. మాతృ మరణాల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ప్రతి మాతృ మరణంపై జిల్లా స్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గర్భిణుల క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ, సంస్థాగత ప్రసవాల ప్రోత్సాహం, అధిక ప్రమాద గర్భిణుల నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మాతృ మరణానికి సంబంధించిన కేసులను విడివిడిగా సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రామింగ్ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


