షాద్‌నగర్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆర్డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారా యణ, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య, సీఐ సీతారాం ఆధ్వర్యంలో సోమవారం విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పరిగిరోడ్డులో ఉన్న పోచమ్మ దేవా లయం నుంచి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల ర్యాంపులు, కట్టడాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను ముందే తొలగించారు.
ఏళ్లుగా నిరీక్షణ
సుమారు 20 ఏళ్ల నుంచి షాద్‌నగర్ చౌరస్తాను విస్తరించాలనే డిమాండ్ ఉంది. చౌరస్తాలో తరచూ ట్రా ఫిక్ సమస్యలు ఎదురు కావడంతోపాటు ప్రమా దాల బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.రోడ్డు విస్తరించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగింది. పట్టణానికి చెందిన ఆర్.ఎన్.రాము అనే యువకుడు ఏడాది కాలంగా రోడ్డు విస్తరించాలని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. షాద్‌నగర్ చౌరస్తా విస్తరించండి అంటూ టీషర్టుపై రాసుకొని నిత్యం ధరిస్తున్నాడు. ధర్నా, ఆందోళనలు, సంతకాల సేకరణ చేపట్టాడు. మున్సిపల్ ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సు లో చాలామంది రోడ్డు విస్తరించాలని పేపర్‌పై రాసి వేశారు. ఈ క్రమంలో చౌరస్తా విస్తరణ చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఇటీవల ఆర్డీఓ సరిత మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై అందరి అభిప్రాయాలు సేకరించారు. దీంతో ఎట్టకేలకు విస్తరణ పనులు మొదలయ్యాయి.


