షాద్‌నగర్‌రూరల్: రైతులు వరి పంటను తగ్గించి వర్షాభావ పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్ల రైతువేదికలో సోమవారం విత్తనమేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అనుకున్న స్థాయిలో ఉండదనే విషయాన్ని రైతులు గ్రహించాలని తెలిపారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరిని తగ్గించుకొని ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించి తగిన పంటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని పేర్కొన్నారు. ఫాం పాండ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీని అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం కంది, మొక్కజొన్న అంతర పంటలుగా సాగు చేసిన రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బాబునాయక్, అనురాధ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్‌అలీఖాన్ బాబర్, డైరెక్టర్లు సురేష్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, భరత్, జిల్లా వ్యవసాయాధికారి సుజాత, ఏడీఏ రమాదేవి, ఏఓ నిషాంత్‌కుమార్, ఉద్యానశాఖ అధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.


