కడ్తాల్: ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి ఎర్త్‌సెంటర్‌లో సోమవారం కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా దేశంలో, ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పర్యావరణ సామాజిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచం ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో విద్యాధికారులు, ఉపాధ్యాయులు పర్యావరణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పాలసీ నిపుణుడు నర్సింహారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్తలు సాయిభాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, వైఈఎల్పీ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకట్‌రెడ్డి, సుస్థిర పుడమి ఎడిటర్ రమేశ్‌రావు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.


