● ఎక్కడైనా ఒకే చోట
నమోదు చేయించుకోవాలి
● బషీరాబాద్ తహసీల్దార్ షాహేదాబేగం
బషీరాబాద్: ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టరిత్యా నేరమని, ప్రతి అర్హుడైన ఓటరు తన సాధారణ నివాసం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అధికారులు, బీఎల్‌వోలు అప్రమత్తంగా పనిచేసి, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి నమోదులను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. బషీరాబాద్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ సంత్‌కుమార్‌తో కలిసి బీఎల్‌ఓలు, వివిధ రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఏఎస్‌డీలతో కలిపి ఇప్పటివరకు 95.11 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి, వందశాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే ఏఎస్‌డీ(అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా ధ్రువీకరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ప్రజలు కూడా సహకరించాలని, అర్హులైన ప్రతిఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించాలన్నారు. అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


