యంత్రంలో నలిగి కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

యంత్రంలో నలిగి కార్మికుడి మృతి

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

షాద్‌నగర్‌: ఫరూక్‌నగర్‌ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని ఓ పరిశ్రమలో వలస కార్మికుడు ప్ర మాదం బారిన పడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 7గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా కంపెనీ నిర్వాహకులు విషయాన్ని బయటకు రానీయలేదు.

బతుకుదెరువు కోసం వచ్చి..

ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ భద్ర (21)కు ఏడాదిన్నర క్రితం నూనిసింగ్‌తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మూడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం షాద్‌నగర్‌కు వచ్చి, ఎలికట్ట శివారులోని చెట్టినాడ్‌ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వెళ్లిన భద్ర.. డెలివరీ నిమిత్తం భార్యను అక్కడే వదిలేసి ఎలికట్టకు వచ్చాడు. పది రోజుల క్రితం పాప పుట్టిందని తెలియడంతో మరో రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు.

కేసు నమోదు..

కార్మికుడు భద్ర కంపెనీలో టైల్స్‌ పౌడర్‌ తయారు చేసే యంత్రం వద్ద పనిచేస్తాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయిన భద్ర అందులోనే నలిగి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న మృతుడి పెద్దనాన్న కొడుకు దూమ బదరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బిజయ భద్ర (ఫైల్‌)

పది రోజుల బిడ్డతో నూనీ

అనాథలైన తల్లీబిడ్డ..

భద్ర రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న నూనీ తన బిడ్డను ఎప్పుడెప్పుడు అతనికి చూపిస్తానా అనే ఆత్రుతతో గడుపుతోంది. ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆమె బతుకును దుర్భరం చేసింది. భద్ర ఇకలేడని, ప్రాణాలతో రాడని తెలియడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగానే భద్ర మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎలికట్ట శివారులోని పరిశ్రమలో ప్రమాదం

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement