● చిన్నారి సహస్ర మృతిపై
విద్యార్థి సంఘాల ఆందోళన
● విద్యాశాఖ, రవాణా శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు
కొందుర్గు: కాసులకు కక్కుర్తి పడుతున్న పలు ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు విద్యార్థులను తరలించేందుకు కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తున్నాయి. అరకొర వేతనాలు ఇస్తూ వచ్చీరాని డ్రైవర్లకు స్టీరింగ్ అప్పగిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని వాహనాలను నడపడంతో పాటు కనీసం హెల్పర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అమాయక చిన్నారులు గాయాలపాలవడంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతలోనే దారుణం..
కాస్లాబాద్ గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల నాలుగేళ్ల కూతురు సహస్ర శుక్రవారం పాఠశాల బస్‌కింద పడి చనిపోయిన ఘటన బాధిత తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. ఇరవై రోజుల క్రితమే చిన్నారిని జిల్లేడ్‌చౌదరిగూడలోని అభ్యాస్ విద్యాపీఠంలో చేర్పించారు. ఉదయం సహస్రను స్కూల్‌కు పంపించిన అనంతరం తల్లిదండ్రులు పనులకు వెళ్తారు. మరో కూతురును కృష్ణయ్య తల్లి చూసుకుంటుంది. సాయంత్రం బస్సు వద్దకు వెళ్లి సహస్రను ఇంటికి తీసుకువస్తుంది. శుక్రవారం సహస్ర కోసం వేచిచూస్తుండగా చిన్నపాప నీళ్లు కావాలని ఏడ్వడంతో అప్పటివరకూ వేచి ఉన్న నాయనమ్మ అప్పుడే ఇంటికి వెళ్లింది. ఆమె తిరిగివచ్చేలోపే దారుణం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లేడ్‌చౌదరిగూడలో ఆందోళన నిర్వహించారు.
కాలం చెల్లిన బస్సే..
అభ్యాస్ విద్యా పీఠంలో 1నుంచి 8వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిని వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చేందుకు మూడు బస్సు లను వినియోగిస్తున్నారు. ఇందులో ఓ బస్సును ఇటీవలే కొనుగోలు చేశారని ఎంవీఐ స్వప్న తెలిపారు. మిగిలిన రెండు బస్సుల కాలపరిమితి ముగిసి ఉండవచ్చన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు కాలం చెల్లినదేనని ధ్రువీకరించారు.


