యాచారం: సర్వేనంబర్ 127లో అసైన్డ్ రైతుల కబ్జా భూమిని రీ సర్వే చేయించాలని, కబ్జాలోని రైతులకు పరిహారం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొండిగౌరెల్లి రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సర్పంచ్ కోలన్ రమాదేవి ఆధ్వర్యంలో 127 సర్వేనంబర్‌తోపాటు 19, 68 సర్వేనంబర్ల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టాదారు, పాసుపుస్తకాల్లో కంటే తక్కువ ఎకరాలకు పరిహారం అందజేసేలా జాబితా ప్రకటించారని పేర్కొన్నారు. రీ సర్వే చేయించాలని తహసిల్దార్‌ను కోరితే సమాధానం ఇవ్వకపోగా వెళ్లిపొండని దురుసుగా మాట్లాడారని మండిపడ్డారు. కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వ్యక్తిగత పని మీద వచ్చిన రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులతో మాట్లాడినా వినిపించుకోలేదు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు కల్పించుకుని వారిని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. సర్వేనంబర్ 127ను రీ సర్వే చేయిస్తానని, కబ్జా రైతులకు పరిహారం చెల్లింపై త్వరలో కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా


