కొందుర్గు: ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా వ్యవసాయ భూముల గట్టు పంచాయితీ ఉందని, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే రీ సర్వే ఒక్కటే మార్గమని భూములు కొలతల జిల్లా అధికారి రాంరెడ్డి స్పష్టం చేశారు. రీ సర్వేకు ప్రయోగాత్మకంగా ఎంపికై న జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లిలో శుక్రవారం తహసీల్దార్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. రీ సర్వేలో భాగంగా మొదట ప్రభుత్వ భూములు, చెరువులు, గ్రామకంఠం, నక్షబాటలను గుర్తించి ప్రత్యేక నంబర్లు కేటాయిస్తారని తెలిపారు. ప్రస్తుతం రైతులు ఎక్కడైతే కాస్తులో ఉన్నారో పహానీల ప్రకారం అక్కడే హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లు గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అభ్యంతరాలుంటే రైతులు ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. అనంతరం తూంపల్లి నుంచి షాద్‌నగర్–పరిగి రహదారికి వెళ్లే నక్షబాటను కొందరు కబ్జాచేశారని, నక్షబాటను విడిపించి రైతులకు, గ్రామస్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని పలువురు గ్రామస్తులు సర్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రయ్య, ఉపసర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు.
భూముల కొలతల జిల్లా అధికారి రాంరెడ్డి


