మహేశ్వరం: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, పాండు రంగారెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని సుమారు 60 కిలోల రాగి తీగలను దుండగులు గురువారం అర్ధరాత్రి దొంగిలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగలను ఎత్తుకెళ్లిన ఆనవాళ్లను గమనించి పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


